1. ఉదయ కుంకుమ నోము :
బాలికకు వివాహమైన సంవత్సరమున మాఘ మాసంలో రధసప్తమినాడు తులసికోట వద్ద ఏడు పిడకలతో పాటు పొంగించి సూర్యునకు ప్రీతి కరంగా పొంగలి తయారుచేసి, ఆపైన గౌరీ పూజచేయించి నివేదన పెట్టి మొదటిదిగా ఈ నోము పట్టిస్తారు. ఈ నోము పట్టిన బాలిక ప్రతిరోజూ ఉదయమే లేచి ముఖం కడుక్కుని బొట్టు పెట్టుకుని, మరొక ముత్తైదువకు బొట్టుపెట్టాలి. ఇలా సంవత్సరం వరకూచేసి ఆఖరున ఒక ముత్తైదువకు తలంటి నీళ్ళూ పోసి సకల భోజ్యములతో భోజనం పెట్టి చీర, రవికల గుడ్డ, కుంకుమతో నిండిన బరిణె, దక్షిణ తాంబూలాదులతో వాయనం ఇచ్చి ఉద్యాపన చేసుకోవాలి. ఈ నోముతో పాటు చిట్టిబొట్టు నోము, కాటుక గౌరినోము, నిత్యశృంగార నోము, పువ్వులు పండు- తాంబూలం నోము మొదలగు నోములు పట్టిస్తారు.
ఈ నోములన్నీ బాలిక జీవితారంభానికి తొలిపాఠాలు అని చెప్పవచ్చు.
2.చిట్టిబొట్టు నోము:
ఈ నోము పట్టిన బాల ఉదయమే లేచి కాలకృత్యాలు తెర్చుకుని తలదువ్వి జడవేసుకుని, స్నానంచేసి, ఉతికి ఆరవేసిన మడిబట్టలు కట్టుకుని, బొట్టూ కాటుకా పెట్టుకుని పసుపూ, గంధంపూసుకుని, అక్షతలు పట్టుకుని -
"చిట్టిబొట్టు పట్టవలె సిరిగల ఇంట పుట్టవలె
పట్టుపుట్టము కట్టవలె పసిడినగలు పెట్టవలె
ఏడుగురన్నలతో పుట్టవలె ఏకచక్రం ఏలవలె
పదుగురన్నలతో పుట్టవలె పట్టభద్రుని చేపట్టవలె"
అనికధ చెప్పుకొని అక్షతలు పైన వేసుకోవాలి, తరువాత అయిదుగురు మిత్తైదువలకు పసుపురాసి, కుంకం బొట్టుపెట్టి, గంధంరాసి, బొట్టుకు క్రిందుగా గంధంచుక్కపెట్టి, దానిపై రెండు అక్షింతలు అంటించి, అక్షతలు వారి చేతిలో పెట్టి, పాదాలకు మ్రొక్కి అక్షతలు తలపై వేయించుకొని వారి దీవన పొందుతారు.