పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


[1]కుతుబ్ మీనార్


ఇది మొగల్‌ దివాణమా?
ప్రళయ శివ మహా శ్మశానమా?
ఇది విజయ స్తంభమా?
చలవిద్యుచ్చంద్ర చూడ దంభమా?
ఇవి జీర్ణసమాధులా?
ప్రథమగణ నివాస వీథులా?
ఇది యవన వికాసమా?
నటేశ తాండవ విలాసమా?

  1. ఈ గీతాభావము సముద్రగంభీరము. 11వ నవంబరు తేదీని ప్రపంచములో అన్నిదేశాలలోనూ యుద్ధములో చచ్చినవారినీ, జయించినవారినీ కూడా స్మరించడానికి సభలు చేస్తారు. ఈ రోజున (11-11-1932) ఢిల్లీ రాజధానిలో ఆంగ్లేయులు విజయకోలాహలం చేస్తున్నారు ఆబాలగోపాలం రోజంతా. నాగుండె పీక్కునిపోయింది. వేదన తగ్గటానికై కుతుబ్‌మీనారుకు పోతిని. అచ్చటి చిత్రము చూచి వ్రాసిందీపాట. ఢిల్లీసామ్రాజ్య మెవరిది? ఇప్పుడు విజయకోలాహలం చేస్తున్న ఆంగ్లేయులదా? కుతుబుమీనారు విజయస్తంభము గట్టించిన ముసల్మానులదా? పాండవులకు అశోక పృథ్వీరాజాదులకు వారసులైన ఆర్యులదా? ఒకప్రక్క కుతుబుమీనారు, ప్రక్కన అశోకస్తంభము, ఒకప్రక్క ముసల్మాను మసీదు, ఖిల్లా, ఇంకొకప్రక్కన ఆర్యదేవాలయము దుర్గమా! పాడై రూపుమాసిపోతూవున్న ఈ వుభయదృశ్యాలపైనా పరదేశవాసులైన ఆంగ్లేయుల పరిపాలనా!! భావకవి సామ్రాట్టునైన నాదికాదా యీ ఢిల్లీ?