పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివరాత్రి


పరమశివా యని నోట నిండుగా
    పల్కవేమిరా యీవేళయినా!
కరుణామయు డతడే కష్టమ్ముల
    గట్టెక్కించునురా, ఓ పాపీ!
పావన గంగాస్నానము జేసుక
    పారదోలరా పాపము లన్నియు
నీ విధినైనను పెరిగియున్న నీ
    యిహజన్మపాప మేగెడునేమో!
కొండకోనలో నల్లదె శివపూ
    జుండు పార్వతిని మది నిలుపుమురా
దండికాంతు లిడు నామె దీపికలు
    తలగదోలురా నీ పాపతమము!
కరముల తాళాల్‌ కాళ్ళను గజ్జెలు
    కలిగి నాట్యము న్సలుపుమురా
పరవశముగ శివతాండవ మాడుచు
    దురిత దూరమౌ నిద్దుర గనరా!
పరమశివా యని నోటనిండుగా
    పల్కవేమిరా యీవేళయినా!