పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నీదు గానామృతము గ్రోలి, నిన్ను గూడి
నిభృతనికుంజ గృహముల నెల్లకాల
మీ నవోద్యానమున విహరింపనీవె?"

అనగ, మజ్నూను సూర్యునియట్లు వెలుగు
వదనమున గ్రమ్ము జడల నావలకు ద్రోసి,
కన్నులను విప్పి, లైలను గాంచి, నవ్వి
"లైలవా! కల్ల; నీ వెట్లు లైల వౌదు?

విశ్వమెల్లను దానయై వెలుగునామె
స్వచ్ఛ కాంతిదౌ సంఛిన్న శకలి వేమొ?
అంతియేగాని లైల వీవన్న నమ్మ
నిదిగో నాలైల నీకు జూపింతు గాంచు"
మంచు లైలాయనుచు గౌగలించి లతల
పూవులను లైలా యంచు ముద్దుగొనుచు
పక్షులను లైలా యంచు పలుకరించి
పలుదిశల లైలా యంచు పరుగు లిడుచు
బోయె మజ్నూను ఆనందపురము జేర.