పుట:Geetham Geetha Total.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30. తే. అఖిలజగమున ననుఁజూచి, యటులె యఖిల
జగము నాయందె వీక్షించు సజ్జనుండు;
వానినే నెన్నఁటికి వీడ; వాఁడు నన్ను
నెన్నఁటికి వీడి వసియింపఁ డిరద్రతనయ.

31. తే. ఎల్లభూతంబులందునే నేకరూప
మున వసించుట నెవ్వడు గని భజించు
నట్టి యోగి వర్తించు నాయందె, యాతఁ
డెన్ని విధముల వర్తించుచున్నఁగాని.

32. తే. జగతి సర్వభూతములకు సంభవించు
వ్యసన మైనను సుఖమైన నాత్మసామ్య
ముగఁ దలంచుచు నంటని మోక్షగామి
యతులగుణవంతుఁ డంచు నామతము పార్థ !

అర్జునుడిట్లనియె :-

34. ఆ. అమితచంచలంబు నతిదృఢంబు బలంబు
నైన మనసు నిగ్రహంబొనర్ప
దుష్కరం బటంచుఁ దోఁచుచున్నది కృష్ణ !
గాలి నెవఁడు మూట గట్టఁగలఁడు?

శ్రీ భగవంతుడిట్లనియె :-

35. ఆ. సంశయంబు లేదు స్వాంత మత్యంతచం
చలము దాని నిల్పనలవి గాదు;
అట్టిదాని మనుజుఁడభ్యాస వై రాగ్య
ములఁ జరించి నిల్పవలయుఁ బార్థ !