పుట:Geetham Geetha Total.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22. తే. దొరకినట్టి లాభంబుతోఁ దుష్టిఁ జెంది
ద్వంద్వములను వర్జించి మత్సరము మాని
సిద్ధ్యసిద్ధ్యంబులను సమచింతఁ జూచి
కర్మలొనరింప బంధము । ల్గలుగఁబోవు.

23. తే. సంగశూన్యుండు ఫలవిసర్జనవరుండు
వీతచాంచల్యుఁడగు జ్ఞానచేతనుండు
నాచరితయజ్ఞ కర్ముఁడౌ నతనిపూర్వ
కర్మములును నిశ్శేషంబుగా నశించు.

33. తే. ద్రవ్యయజ్ఞంబుకంటె నుత్తమమటండ్రు
జ్ఞానరూప మౌయజ్ఞంబు సవ్యసాచి !
యఖిలకర్మంబులను జ్ఞానమందె చేరి
పరిసమాప్తంబు లగునని యెఱుగవలయు.

34. తే. తత్వవేత్తలౌ విజ్ఞానధనులయెడల
వినయ వినమితసాష్టాంగ విధుల సల్పి
సేవ లొనరించి ప్రశ్నలఁజేయ, వారు
జ్ఞానమార్గోపదేశంబు సలుపఁగలరు.

35. తే. ఎట్టి జ్ఞానంబు గల్గిన నిట్టి మోహ
ముద్భవింపదో యట్టిభావోద్భవమున
నఖిలభూతజాలంబులనాత్మయందె
కందు, నావల వాని నాయందఁ గనెదు.

36 ఆ. అఖిలపాపజన్ములందును నీ వెంత
యధమపాపయుతుఁడవైనఁగాని
కలుషజలధి యెల్ల జ్ఞానప్లవంబుచే
దాఁటఁగలవు నీవు ధన్యచరిత!