పుట:Geetham Geetha Total.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. తే.చేయవలసినయజ్ఞంబు చేసితీర
వలసినది యని మనసు నిశ్చలముఁ జేసి
శాస్త్రవిధిఁ బూని ఫలవిసర్జన మొనర్చి
జనుఁడు ఘటియించునది యగు సాత్త్వికంబు.

12. తే. ఫలముఁ గోరి చేయఁ బడునట్టి యజ్ఞంబు
తనమహత్త్యమును బ్రదర్శనంబు
చేయఁదలఁచుయజ్ఞమీయవి యర్జునా!
జగతియందు రాజసంబు లండ్రు.

13. ఆ. విధుల మాని, నీతివిరహితద్రవ్యంబు
తోడ మంత్రములను వీడి, దక్షి
ణల నిడకయె, శ్రద్ధ గలిగించుకొనక, య
జ్ఞంబు సేయఁ దామసం బటండ్రు.

14. తే. దేవతల జ్ఞానవంతుల ద్విజుల గురుల
యందు భక్తియు, శౌచంబు నార్జవంబు
బ్రహ్మచర్య మహింసాప్రవర్తనంబుఁ
బరఁగు నివియ శరీరతపంబు లనఁగ.

15. తే. పరుల కె గ్గొనరింపని భాషణంబు
ప్రియము హితమును సత్యంబు పెం పొనర్చు
నటులు మాటాడుటయు వేద మభ్యసించు
టయును వాఙ్మయంబగు తపంబయగుఁ బార్థ!

16. తే. మనమునను నిర్మలత్వసౌమ్యత్వములును
వాక్ప్రవృత్తికి మనసుచేబంధనంబు
నాత్మనిగ్రహమును భావ మందు శుద్ధి
మానసికతపంబు లటంచు మహిని వెలయు.