పుట:Geetham Geetha Total.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీమద్భగవద్గీత

సప్తదశాధ్యాయము.

శ్రద్ధాత్రయవిభాగయోగము


                                                                                                                       
 అర్జునుడిట్లనియె :-

01. తే.ఎవరు శాస్త్రీయపద్ధతు లెల్ల విడిచి
శ్రద్ధ వహియించి యజ్ఞముల్‌ సల్పుచుంద్రు
అట్టివారలనిష్ఠ నేమందుఁ గృష్ణ !
సత్త్వమా? రాజసమ? తామసంబ? చెపుమ.

శ్రీ భగవంతుడిట్లనియె :-

02. తే.శ్రద్ధ త్రివిధములుగ సర్వజనులకు స్వ
భావజనిత మగుచుఁ బరఁగుచుండు;
సాత్త్వికంబు రాజసంబును మఱి తామ
సంబు ననెడువిధుల సవ్యసాచి!

03. తే.సర్వజనులకుఁ దమమానసస్వభావ
మనుకరించెడుశ్రద్ధయే తనరుచుండు;
శ్రద్ధయే పూరుషుండు; ఏ శ్రద్ధ నెవఁడు
పూనియుండునొ వాఁడట్టి పురుషుఁడగును.

04. తే.దేవతలను యజింత్రు సాత్త్వికజనములు
రాజసులు గొల్త్రు యక్షుల రాక్షసులను
అన్యజనములు భువిఁ దామ సాఖ్యఁ జెలఁగి
పూజ లొనరింతు రలప్రేత భూతములకు.