పుట:Geetham Geetha Total.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

06.తే. అర్జునా! లోకమున దైవమాసురంబు
ననెడుద్వివిధభూతంబులు జనన మొందు;
దైవము వచింపఁబడె సవిస్తరము గాఁగ
నింక నాసురగుణముల నెఱుఁగ వినుము.

07. తే. ఇలఁ బ్రవృత్తి నివృత్తులంగలుగుభేద
మెఱుఁగఁ జాల రొకింత యాసురజనములు;
శౌచమన్నది సున్న; యాచార మట్లె;
సత్యమును నట్లె వారికి సవ్యసాచి!

08. తే. అఖిలజగము ననీశ్వరంబనుచు మఱియు
నప్రతిష్ఠంబసత్యంబటండ్రు వారు;
అది పరస్పర సంభూతమనుచుఁ, గార
ణంబు వేఱు లే దండ్రు కామంబు దప్ప.

09. ఆ. ఇట్టి మౌఢ్యమును వహించి నష్టాత్ములై
అల్పబుద్ధు లగుచు నశభు లగుచు
నుగ్రకర్ము లగుచునుద్భవించుచు వారు
జగతి కెల్ల క్షయము సల్పుచుంద్రు.

10. తే. ఆశ్రయింతురు దుష్పూరమైనకామ
మందుచే మోహమున నసదర్థములను
గడన సేతురు మదదంభ గర్వయుతులు;
వర్తనం బిది యశుచిప్రవర్తనులకు.

11. తే. అపరిమితచింతతోఁ బ్రళయాంతములను
గడనసేయంగఁ గోరికగల మనుజులు
విషయసుఖములకంటెను వేఱొకండు
శ్రేష్ఠమైనది లే దంచుఁ జెప్పుచుంద్రు.