పుట:Geetham Geetha Total.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

05.ఆ. సవ్యసాచి! జీవుఁడవ్యయుం డయ్యును
సాత్త్వికంబు రాజసంబు తామ
సంబు లనెడిప్రకృతి జనితత్రయంబుచే
బంధ మొందు దేహ బద్ధుఁడగుట.

06. ఆ. సత్త్వగుణము నిర్మలత్వంబుచేఁ బ్రకా
శంబు మఱి యనామయంబు నొంది
జ్ఞానసుఖములందు సంగంబు గల్పించి
బంధనం బొనర్చుఁబార్థ ! నరుని.

07. ఆ. రాజసంబు మహిని రాగాత్మకం బౌచు
విషయకాంక్ష లెల్ల వృద్ధిఁ జేయు;
కర్మలందు సక్తి గల్పించి నరునకు
బంధనం బొనర్చుఁ బార్థ! వాని.

08. తే. జ్ఞానశూన్యత చేఁ దామసంబు గలిగి
మోహమున సర్వదేహులముంచి వైచు;
అర్జునా; యలసత్వ నిద్రాదులందె
దేహులను జిక్కఁబట్టి బంధించుచుండు.

09. తే. సక్తి సుఖమునఁ గల్గించు సత్త్వగుణము;
రాజసం బిచ్చుఁ గామ్యకర్మముల రక్తి;
జ్ఞానమును గప్పి విపరీత కర్మలందు
మమతఁ గల్గించు నెపుడుఁ దామసము పార్థ!

10. తే. సత్త్వ మొక్కడ మించు రాజసతమముల;
నట్లె మఱియొక్క యెడ రజం బధిక మగుచు
సత్త్వతామసముల మించు; సత్త్వరాజ
సముల వేఱొకయెడఁ దామసంబు మించు.