పుట:Geetham Geetha Total.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీమద్భగవద్గీత

చతుర్దశాధ్యాయము.

గుణత్రయ విభాగ యోగము


శ్రీ భగవంతుడిట్లనియె :-

01. తే.మరలఁ జెప్పెద నర్జునా! పరమ మైన
జ్ఞానములలోన నుత్తమ జ్ఞానపథము
నెల్ల మునివర్యులును దానినెఱిఁగి గాదె
పడయ నేర్తు రజస్రంబు పరమసిద్ధి.

02. తే.ఇట్టి జ్ఞానంబు నెవ రాశ్రయించుచుందు
రట్టివారు నాసాధర్మ్యమంద గలిగి
సృష్టియందును జన్మంబుఁ జెందఁబోరు
ప్రళయమందును దుఃఖఁబుఁ బడయఁబోరు.

03. ఆ.ఈ యచేతనప్రకృతి నాదుయోని యౌ;
దాని కేన బీజదాత నగుదు;
అటులె భూతజాలమగుచుండు నుద్భవం
బనుచు నెఱుఁగవలయు నవని, బార్థ !

04. ఆ.సర్వయోనులందు సంభవించుచు నుండు
సకలభూతములకు సవ్యసాచి!
మాత మూలప్రకృతి; మఱి బీజదాత నౌ
నేను దండ్రి నంచు నెఱుఁగవలయు.