పుట:Geetham Geetha Total.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత

ద్వాదశాధ్యాయము.

భక్తియోగము


అర్జునుడిట్లనియె :-
 
01. తే. ఇట్లు సతతంబు నిను భజియించునట్టి
భక్తజనులందు మఱియు నవ్యక్తమైన
యక్షరంబు నుపాసించునట్టి జనుల
యందు యోగవిత్తము లెవ్వరగుదురయ్య?

శ్రీ భగవంతుడిట్లనియె :-

02. ఆ. పరమశ్రద్ధ గలిగి స్వాంతంబు నాయంద
నిలిపి నిత్యయుక్తనిరతిఁ బూని
నన్నుపాసనం బనారతంబును జేయు
యోగివర్యు లెల్ల యుక్తతములు.

03. తే. అవ్యయంబు ననిర్దేశ్యమగుచుఁ, జింత
చేయరాని దై సర్వత్ర చెలఁగి, యచల
మగుచుఁ గూటస్థమును ధ్రువంబైనప్రత్య
గాత్మ దలఁచి యుపాసించునట్టివారు.

04. ఆ. ఇంద్రియముల నిగ్రహించుచు, సర్వభూ
తములయందు బుద్ధి సమముఁ జేసి
సర్వభూతహితము సల్పుచు, ననుఁ బొందు
నట్టివార లగుదు రమలచరిత!