పుట:Geetham Geetha Total.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత

ఏకాదశాధ్యాయము.

విశ్వరూపసందర్శన యోగము


అర్జునుడిట్టనియె :-

01. ఆ.నన్ననుగ్రహింప నా కింతదనుక నీ
వెఱుఁగఁజెప్పినట్టి పరమగుహ్య
మైనశాస్త్రవచన మధ్యాత్మ విషయంబు
గాన మోహ మెల్ల మానఁ జేసె.

02. ఆ.సర్వభూతములకు సంభవప్రళయము
ల్నీవె చేతు వనుచు, నీదుమహిమ
మవ్యయం బటంచు నరవిందలోచనా!
వింటి నీవె చెప్ప విస్తరముగ.

03. ఆ.నిన్నుఁ గూర్చి యిపుడు నీవచించినదెల్ల
సర్వలోకనాథ ! సత్యమ యగు;
ఇచ్ఛ వొడమె నీదు నీశ్వరరూపంబు
కన్నులారఁ గాంచఁ గమలనాభ !

04. తే.సర్వలోకేశ! యారూప ముర్వియందు
నేను గనుఁగొనఁగాఁ దగు నేని నాకుఁ
జూపు మయ్యది నీనిజరూప మగుట
సవ్యయంబును నాశ్చర్యమగును గాదె?