పుట:Geetham Geetha Total.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత

దశమాధ్యాయము

విభూతి యోగము


శ్రీ భగవంతుడిట్లనియె :-

01. ఆ. ప్రీతి నింతవఱకు విన సంతసించిన
విషయములను మఱియు విశదపరుప
నీదుహితము గోరి నేనింక నొకమాటు
శ్రేష్ఠవచనముల వచింతు వినుము.

02. ఆ. వరఋషీశ్వరులును సురగణంబులను నా
యద్భుతప్రభావ మరయఁగలరె?
అమరులకును ఋషులకాదిభూతుఁడ; వారి
కేన శక్తు లెల్ల నిచ్చువాఁడ.

03. తే. అఖిలలోకేశ్వరుండ నంచజుఁడ ననుచు
ఆదిరహితుండ నంచు నన్నరయువాని
మౌఢ్యమెల్లను నశియించుమఱియు సర్వ
పాపములనుండి విడివడు; భవ్యచరిత!

04. తే. బుద్ధి జ్ఞాన మసమ్మోహమును క్షమయును
సత్యనిరతత్వమును దమశ్శమగుణములు
సౌఖ్యదుఃఖముల్‌ భవమును సంకటంబు
భయముఁ జెందుచుంటయును నిర్భయము మఱియు.

05. తే. తుష్టియును నహింసయు సమదృష్టి తపము
నీవి యశమును మఱి యశోహీనతయును
భూతములు పొందు బహుగుణంబులును మహిని
గలుగుచుండును నాదుసంకల్పముననె.