పుట:Geetham Geetha Total.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24.ఆ. సర్వదేవతలకు సల్పుయజ్ఞములందు
భోక్త నేన, మఱి ప్రభువును నేన;
నను యథార్థరీతిఁ గననివారల కెల్ల
సుఖము గలిగి పిదపఁ జ్యుతియుఁ గలుగు.

25. తే. దేవతాపూజ పొందించు దేవతలనె;
పితరుల భజింపఁ జేర నౌఁ బితరులందె;
భూతపూజచే నగుఁ జెంద భూతములనె;
నన్నుఁ బూజింపఁ జేర నౌ నన్నె పార్థ!

26. కం. ఫల మైనఁ బుష్పమైనను
జల మైనను బత్రమైన సద్భక్తిని ని
ర్మలబుద్ధి నా కొసంగ, మి
గుల స్వల్పం బైన, దానిఁ గూర్మి భుజింతున్‌.

27. ఆ. దేనిఁ జేయుచుంటి దేనిని దినుచుంటి
దేని వ్రేల్చుచుంటి దేని నొసఁగు
చుంటి తపము సేయుచుంటి వెద్దానిని,
అర్పణం బొనర్పు మన్ని నాకె.

28. తే. అటులు, మానససంన్యాసమనెడుయోగ
మునఁ దొలంగు శుభాశుభము లగు కర్మ
ఫలములును వానిబంధనములును, బార్థ !
చేరుదువు నన్నుఁ బిదప నవారితముగ.

29. ఆ. సముఁడ నగుదు నేనుసర్వభూతములకు;
ద్వేషి లేఁడు నాకుఁ బ్రియుఁడు లేఁడు;
ఎవరు భక్తిఁగొలుతు రిల నన్ను, నాయందు
వారు, మఱియు నేను వారియందు.