పుట:Geetham Geetha Total.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. తే. రాక్షసం బాసురంబును భ్రాంతిజన్య
మైనప్రకృతిస్వభావంబు నాశ్రయించు
మూఢులకుఁ గల్గు మోఘాశ మోఘకర్మ
ములప్రసక్తి మోఘజ్ఞానమును గిరీటి!

13. తే. దైవసంబంధ మైనసత్త్వప్రకృతిని
నమ్మి చేరుమహాత్ములనన్యమాన
సమున భజియింత్రు నన్ను భూతములమూల
కారణుని గాఁగ నవ్యయుఁ గాఁగదెలిసి.

14. తే. సతతసంకీర్తనంబులు సల్పువారు
దృఢమనస్సుతోడను బ్రయత్నించువారు
చెలఁగి భక్తి నమస్కృతుల్సేయువారు
నిత్యయుక్తు లుపాసింత్రు నియతి నన్నె.

15. తే. విశ్వమెల్లను వ్యాపించి వివిధరూప
ములఁ జరించెడిన న్నేకముగ నెఱింగి
జ్ఞానయజ్ఞంబుచే నుపా సనలఁ జేసి
యోగ మొనరింత్రు మఱికొంద ఱుర్విజనులు.

16. తే. నేనక్రతువును, యజ్ఞంబు నేన యగుదు,
నేన స్వధయును, నౌషధంబేన, మఱియు
నేన మంత్రంబు, నాజ్యంబునేన, యగ్ని
నేన, హోమంబు సహితమునేన, పార్థ!

17. తే. అఖిలజగతికిఁ దలిదండ్రు లగుదు నేన;
ధాత నే నౌదు; మఱియును తాత నగుదుఁ;
బరమవేదస్వరూప మౌ ప్రణవ మేన;
ఋగ్యజుస్సామములలోని ఋక్కు లేన.