పుట:Geetham Geetha Total.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17. ఆ. యుగసహస్ర మొక్క పగలు బ్రహ్మకు; మఱి
యట్లె యుగసహస్రమతని రాత్రి;
దీనిఁ దెలియువారు గానాఁగల్గుదు రహో
రాత్రములకుఁ గలతెఱంగు పార్థ !

18. తే. వ్యక్త మెల్లను నవ్యక్త మందు నుండి
బ్రహ్మపగటిని జగతిగాఁ బ్రభవ మందు
బ్రహ్మరాత్రంబు మొదలుగా మరల జగతి
మాఱి యవ్యక్త మగుచుండు మాన్యచరిత!

19. తే. భూతసముదాయ మెల్ల నీరీతిఁ గర్మ
వశత నుదయించి యుదయించి పగలు వోవఁ
బ్రళయమును బొందుచుండును రాత్రియందు;
పగలు వచ్చినవెంటనే ప్రభవ మందు.

20. తే. అవ్యయంబు నచేతనంబైనయిట్టి
ప్రకృతికంటెను నిత్యమై పరమ మగుచు
జగతి మాసినఁ దాను నాశనము గాని
యన్య మగుభావ మవ్యక్తమగుచుఁ గలదు.

21. తే. అదియు నవ్యక్త మక్షరం బనఁగఁ బరఁగు
బరమగతి గాఁగ నద్దాని నెఱుఁగవలయు;
అది లభించిన, జన్మంబులంత మొందు;
దాని నాదగు నియమన స్థాన మండ్రు.

22. తే. ఎల్లభూతంబులు వసించు నెవనిలోన
నెవనిచే వ్యాప్తమై యుండు నీజగంబు,
అట్టి పురుషుని నుత్కృష్టమై యనన్య
మైన భక్తి చేఁ జెందఁగా నగును బార్థ !