పుట:Geetham Geetha Total.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

05. ఆ. అంత్యకాలమందు నవని న న్నెవ్వండు
స్మరణ చేసికొనుచు మరణ మొందు
వాఁడు పిదప నాదు భావంబునే పొందు;
నిందు సంశయంబుఁ జెందవలదు.

06. తే. ఎట్టి భావంబు మనసునందెంచుకొనుచు
జనుఁడు దేహంబు విడుచుట సంభవించు
నట్టి భావంబునే యతఁడందుచుండు
వాని కెల్లప్పు డదియ యభ్యాసమగుట.

07. తే. కనుక సర్వకాలముల నీ మనసునందు
నన్ను స్మరియించు చుండుము నయచరిత్ర!
మనసు బుద్ధియు మత్సమర్పణ మొనర్చి
చేరఁగల్గుదు నన్నె నిశ్చింతతోడ.

08. తే. అర్జునా ! ధ్యానమునను నభ్యాసమునను
మనసునందును విషయ చింతనము మాని
పరమపూరుషు దివ్యప్రభావు నన్నుఁ
దలఁచుచుండిన, ననుఁ జెందఁగలఁడు నరుఁడు.

09. తే. సర్వదర్శి ననాద్యునిసర్వలోక
శాసనుని, సూక్ష్మములకు సూక్ష్మమగువాని
సృష్టి కారణకర్త నచింత్యరూపుఁ
బ్రకృతివరు సూర్యవర్ణు నెవ్వఁడు భజించు.

10. ఆ. ఆతఁ డంత్యకాలమం దచలుం డౌచు
భక్తి గలిగి యోగ బలము గలిగి
బొమలమధ్యఁ బ్రాణమును లెస్సగా నిల్పి
పరమపురుషుఁ జేరు భాగ్య మొందు.