పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాతిని పేర్చడంలోనూ ఎంతో జాగ్రత్త

రాళ్ళను ఒకదానితో ఒకటి పేర్చటమే కాదు. వాటిని అమర్చిన క్రమంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. రంగమండపం మూడువైపులా నిర్మించిన మెట్లను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. ఒక మెట్టుకోసం వాడిన రాతిని ఎడమవైపు గోడలోపటికి వుండేలా అమర్చితే, దాని తర్వాతి మెట్టుకు వాడిన రాతిని కుడివైపు గోడలోకి బిగించారు. ఇలా ఏకాంతర (ఆల్టర్ నేటివ్) పద్దతిలో రాళ్ళను బిగించుకుంటూ రావడం వల్ల మెట్లను తవ్వకుండా పక్కనున్న గోడలు రక్షణగా వుంటాయి. వరదలూ భూకంపాలకు చెదిరిపోకుండా పట్టివుంచుతాయి కూడా. రంగమంటపంకోసం వాడిన రాతిని చదునుగానే కాక కావలసినంత మందంగా వుండేలా ఎంచుకున్నారు. ముక్కంటేశ్వరాలయపు రంగమండపపు రాతిని పక్కనే వున్న స్తంభాల క్రిందకి చేరేలా కలిపారు. నక్షత్రాకార పు నాది నిర్మాణంలో అంచుల దగ్గరవున్న రాళ్ళు జారిపోకుండా పట్టుతో వుండేంతగా లోపటికి నెట్టి బిగించారు.

నీడలు తాకనంత దూరంలో ఉపాలయాలు

గణపేశ్వరాలయం సమీపంలోవున్న ఉపాలయాలు లేదా సహాలయాల మధ్య దూరం వేర్వేరుగా వుంటుంది. ప్రధాన ఆలయం నీడ ఉపాలయాలపై కానీ ఉపఆలయాల నీడ ప్రధానాలయంపై కానీ పడదు. అలాగే ఒక ఉపాలయం నీడ మరో ఉపాలయం మీద కూడా పడదు. అందుకు అనుగుణంగానే వీటి దూరాలను ఏర్పరచారు. ప్రధానాలయం ఎత్తు ఎక్కువ కాబట్టి దానికీ ముక్కంటేశ్వరాలయానికీ దూరం కొంత ఎక్కువగా వుంటుంది. కానీ ముక్కంటేశ్వరాలయానికీ వేణుగోపాలస్వామి ఆలయానికి మధ్యదూరం మాత్రం వాటి ఎత్తులు తక్కువగా వున్నట్లే తక్కువగా వుంటుంది. ఉత్తరాయణం, దక్షిణాయణం కాలాలలో సూర్యుడి దిశ మారినప్పటికీ, ఉదయం సాయంత్రాలలో నీడల పొడవు బాగా పెరిగినప్పటికీ, రుతువులలో మార్పు వున్నప్పటికీ ఆ నీడలు మరో ఆలయాన్ని తాకవు.

నంది విగ్రహం పై ఎన్నినగిషీలో!

గణపేశ్వరాలయంలోని శివలింగానికి ఎదురుగా ఒక నంది విగ్రహము, బయటి రంగమంటపంలో మరో నంది విగ్రహమూ వున్నాయి.

బయటిది పాతకాలపు రాతినంది. కొంత శిధిలం అయివుంది. బహుశా ఇది గుడినిర్మాణసమయంలో చెక్కినది అయివుండొచ్చు. లోపటి విగ్రహాన్ని తర్వాతి కాలంలో ఏర్పాటు చేసారు.