పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృధాయుధరం, ఇషాధికం అనే పేర్లతో పిలుస్తారు. వివరాలు పటంలో చూడవచ్చు.

శివ లింగములను వాటి నిర్మాత ఎవరు అనేదాని ఆధారంగా వాటిని వర్గీకరిస్తారు. స్వయంభూ లింగములు అంటే స్వయముగా వాటి అంతట అవే వెలసినవి. దైవిక లింగములు అంటే దేవతల చేత ప్రతిష్టింపబడినవి.రుష్య లింగములు అంటే రుషి ప్రతిష్టితాలు. మానుష లింగములు అంటే మానవ నిర్మిత లింగములు. బాణ లింగములు అంటే నర్మదా నదీతీరాన దొరికే తులా పరిక్షకు నెగ్గిన బొమ్మరాళ్ళు(పెబుల్సు) గణపేశ్వరాలయంలోని శివలింగం, మానుష లింగం(మానవులచే ప్రతిష్టితం). దీనిలో మూడుభాగాలుంటాయి. మనకి పైన శివలింగం ఎంత కనిపిస్తుందో ఆ నిష్పత్తి ప్రకారం అంతటి నిర్మాణం పీఠభాగం లోపల కూడా వుంటుంది.

శివలింగాన్ని తాకే ఉదయ కిరణాలు

గర్భాలయంలోని శివలింగాన్ని ఉదయపు సూర్యకిరణాలు సరాసరి తాకుతాయి. తూర్పుకు అభిముఖంగా వుండటం, పరిమాణ రీత్యా పెద్దగా వున్న ద్వారబంధం వుండటం. ద్వారానికీ గర్భాలయానికీ మరీ ఎక్కువ దూరం లేకపోవడం వల్ల ఇది సాధ్యపడుతోంది. ఇది ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైనది, ఆరోగ్యపరంగా ఉపయుక్తమైనది.

రాళ్లను అంటించలేదు కలిపారు

మనం ఇప్పుడు కట్టడాలకోసం సిమెంటు

కాంక్రీటుల మీదనే ఆధారపడుతున్నాం. గణపేశ్వరాలయం నిర్మాణంలో మాత్రం అతికించేందుకు సిమెంటు, సున్నం వంటి పదార్ధాలను వాడలేదు. రాళ్ళను ఒకదానికి ఒకటి రంధ్రము, కూసము పద్దతిలో కలుపుకుంటూ పేర్చుకుంటూ కట్టారు. దీనిని ఇంటర్ లాకింగ్ విధానం అంటారు. అంటే ఇప్పుడు చెక్కకుర్చీలు, మంచాలను బిగించే పద్దతి లాంటి విధానాన్ని వాడారు. కాలక్రమంలో భూకంపాలు వంటివి సంభవించినా సరే తట్టుకునేంత పటిష్టంగా ఈ రాళ్ళను పేర్చి బిగించారు. అందువల్లనే శతాబ్దాలు గడిచినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఆలయం మనముందు గర్వంగా నిలబడివుంది.