పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంటపాలను కళ్యాణ మంటపాలుగా, శైవ మందిరాలుగా మార్చివుంటారు. వేయి స్తంభాల దేవాలయంలో ప్రస్తుతం పునర్నిర్మాణం జరుగుతున్న కళ్యాణ మంటపం కూడా ఇలాంటి జైన మంటపమేనని పలువురు చారిత్రక విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సాధారణంగా జైన మంటప స్తంభాలపై పూర్ణకుంభాలు కనిపిస్తాయి. ఇతర ఆలయ స్తంభాలపై వీటి జాడ ఉండదు. వేయి స్తంభాల గుడిలోని కళ్యాణమంటపంపై కూడా పూర్ణ కుంభాలు కనిపించడం గమనార్హం.


దక్షిణంవైపు మెట్లపై పాదముద్రలు

గణపేశ్వరాలయ రంగమంటపానికి దక్షిణం వైపు వున్న రాతి మొట్లమార్గంపై మామూలు పరిమాణం కంటే పెద్దగా వున్న పాదముద్రల జాడలు కనిపిస్తాయి. ఇవి సహజంగా వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడినవో లేదా కావాలని చెక్కారో తెలియదు. ఇప్పుడు వీటిని శివుడి అడుగుజాడలని చెప్పుకుంటున్నారు. ఇలా పాదముద్రలను పూజించే సాంప్రదాయం బౌద్ధంలో గమనిస్తాం. ఒకవేళ కొంతకాలం బౌధ్దసన్యాసులు ఈ మంటపాన్ని ఆవాసంగా చేసుకుని వుండి వుంటారా? అనే సందేహం ఈ ముద్రల వల్ల కలుగుతుంది.