పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గణపతిదేవుని దీక్షాగురువు శ్రీ విశ్వేశ్వర శంభువని మల్కాపుర శాసనం ద్వారా తెలుస్తోంది. గణపతిదేవుని గురువైన మల్లికార్జునారాధ్యుడు, మల్లికార్జున పండితారాధ్యుని మనవడు.

గణపతిదేవుని అనంతరం ఇతని కుమార్తె రుద్రాంబ పరిపాలించింది. గణపతి దేవునికి కుమారులు లేనందున ఆమె రాఙ్ఞి అయ్యింది. ఈమె పాలనా కాలంలో ఓరుగల్లుకోట శత్రుదుర్భేధ్యంగా, దృఢంగా తయారయ్యింది. ఈమె అనంతరం ప్రతాపరుద్రుడు రాజయ్యాడు. ఇతడు రుద్రాంబకు దౌహిత్రుడు. (సిద్ధేశ్వర చరిత్ర కథనం ప్రకారం రుద్రమదేవి కుమార్తె ముమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడు. కొడుకులు లేనందు వల్ల మనుమడే తనకు అపర కర్మలు చేయాలని తనకి వారసుడుగా రాజ్యపాలన చేయాలని రుద్రమాంబ నిర్ణయంతీసుకుంది.5 ఏళ్ళ వయసునుంచే మనవడిని ఒడిలో కూర్చోబెట్టుకుని రాజ్యపాలన చేసేదట ) రుద్రాంబ ఇతనికి కుమారునిగా స్వీకరించింది. ఇతడు మంచి విజ్ఞానవంతుడు, కవిపండిత పోషకుడు. క్రీ.శ. 1302 నుంచి క్రీ.శ 1323 మధ్య ఓరుగల్లుపై ఢిల్లీ సుల్తానుల సైన్యం ఏడుసార్లు దండయాత్ర చేసింది. గెలవటం కంటే ప్రధానంగా దోచుకు పోయేందుకు వారీ దండయాత్రలను చేసారు. అనేక సార్లు కాకతీయ సైన్యం వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది.

1323వ సంవత్సరంలో ఢిల్లి రాకుమారుడు ఉల్గూఖాన్ (ఇతనే రాజయ్యాక ‘మహమ్మద్ బిన్ తుగ్లక్‌' ) తన అపార సైన్యాన్ని ఓరుగల్లుకు పంపించాడు. ప్రతాపరుద్రుడు ఐదు నెలల కాలం యుద్ధం చేసి చివరకు వారికి బంధీగా పట్టు బడ్డాడు. ప్రతాపరుద్రుడిని ఢిల్లికి పంపించారు. కానీ మార్గం మధ్యలోనే ప్రతాపరుద్రుడు మరణించాడు. దీనితో మహోజ్వలంగా వెలిగిన కాకతీయ సామ్రాజ్యం అంతరించింది.

కాకతీయుల మత విశ్వాసాలు

రాష్ట్రకూటుల పాలనలో జైన అధికారికంగా పోషింపబడుతున్న కాలంలో కాకతీయులు అధికారాలను హస్తగతం చేసుకున్నారు. కాకతీయులు మొదట జైన మతాన్ని ఆనుసరించేవారు. నాటి జైనుల ప్రాభవానికి వరంగల్లు సరిహద్దుల్లోని కొలనుపాక జైన దేవాలయం దర్పణం పడుతుంది. అనమకొండ గుట్టమీది పద్మాక్షీదేవి బహుశా మొదట్లో జైనదేవతే అయివుంటుంది.

కాలముఖ, కాపాలిక, పాశుపత, ఆరాధ్యశైవ, వీరశైవాది శైవ అంతర్గత భేదాలలో పాశుపతశైవం కాకతీయుల కాలంలో ప్రముఖంగా వుండేది. కాకతీయ ధ్వజంపై విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన వరాహ మూర్తి చిహ్నం ఉన్నప్పటికీ, వీరు మాత్రం శైవాన్ని పెంచి పోషించారు. కాకతీయులు శైవాన్ని పోషించడం ప్రారంభించిన తరువాత అనేక జైన