పుట:Ganapati (novel).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

57

సొమ్మిచ్చి వేయ దలచెను. పాపయ్య కప్పుడు పెండ్లిమాట జ్ఞప్తికి వచ్చెను. మూలస్థానములో నొకపిల్ల యున్నదని యతనికిఁ దెలిసి తన కిమ్మని యా పిల్ల తండ్రికి వర్తమానమంపెను. ఆ వర్తమానము తెలిసిన తరువాత బాలిక తండ్రి యగు అన్నంభొట్ల అన్నప్పగారు పిల్లకు బండ్రెండు సంవత్సరములు వయస్సు కావున పండ్రెండువందల రూపాయ లీయవలసినదనియు మూడువందలరూపాయలు నగలు పెట్టవలసిన దనియు నుభయమంగళసూత్రములు బెండ్లికొడుకె చేయించుకొని యుభయులఖర్చులు బెండ్లికొడుకు పెట్టుకొని మందపల్లిలో గాని వేంకటేశ్వరులవాడపల్లిలో గాని పెండ్లి చేసికొనవచ్చుననియు నతనికి వర్తమాన మంపించెను. అది విని కళ్యాణకాలము తనకు నేఁటి కాసన్నమైన దని పాపయ్య సంతసించి యా పద్ధతి కొడంబడి మారువాడీ యొద్దనుండి రాజమహేంద్రవరములో నున్న నారాయణకర్నుగాని మీఁదికి మూఁ డువేల రూపాయలకు దర్శనహుండిపుచ్చుకొని పునహానగరము విడిచి బయలుదేఱెను. అతఁడా నగరము విడిచినపు డెందఱు స్త్రీలు కంటఁ దడిబెట్టిరని చెప్పను! చాపచుట్టలు గిరవాటు వేసినట్లు తమయూరి శవములను మోయువారు లేరనియు ననర్గళముగ నేక వాహపిండములు గుటుకుగుటుకున మ్రింగి తమ పెద్దలకు వైకుంఠ ద్వార సోపానము లెక్కించువారు లేరనియు నగరవాసు లెంతో విచారించిరి. పాపయ్య పునహాను విడుచుచున్నాఁడు గావున నతని విషయమై యిక్కడనె యొకమాట