పుట:Ganapati (novel).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

గ ణ ప తి

చెప్పవలయును. అందఱు తమతమ వృత్తులలో నిగ్రహానుగ్రహ సమర్థులైనట్లె పాపయ్యయుఁ దనవృత్తిలో నట్టివాఁడు. అనుగ్రహించెనా యథాశక్తిగా శవ మూరక మోయును. కోపించెనా దండించును. ఇందుకొక తార్కాణము గలదు. ఒకనాఁ డొకపేటలో నొకయింట నైదేండ్లపసిబిడ్డ మృతినొందెను. గృహయజమానునికడ రెండువరహాలు పుచ్చుకొని యాబిడ్డను మూటఁగట్టి రాత్రియగుటచే నది తన విరోధియైన యెక మహారాష్ట్రుని వీధియరుఁగుమీదఁ బెట్టి పాఱిపోయెను. మఱునాఁడా గృహస్థులు లేచి యది యేదో యనుకొని విప్పిచూచి భయపడి కళవళపడి యమంగళముగ భావించి పాపయ్యను బిలిపించి తీసివేయమని ప్రార్థించిరి. పాపయ్య తన ప్రాతకసి తీరునట్లు పాతిక రూపాయలక్కడ పెట్టించి యా పీడానివారణముఁ జేసెను. ఇఁక విన ననేకోదా హరణములుగలవు. గ్రంథవిస్తర భీతిచే మానవలసి వచ్చె. పాపయ్య రాజమహేంద్రవరములో హుండీమార్చుకొని మందపల్లి వెళ్ళి యిల్లు కట్టుకొని మూలస్థానమునుండి అన్నంభొట్ల అన్నప్పగారిని సకుటుంబముగ రావించి పండ్రెండువందలు వారి కిచ్చి మూడువందలు నగలుపెట్టి సంబంధము గుదిర్చినవానికి నూరురూపాయలు రుసుమిచ్చి యన్నప్పగారి కుమార్తెయైన పిచ్చమ్మను వివాహమాడెను.