పుట:Ganapati (novel).pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

356

గ ణ ప తి

పుచ్చుకొన్నాను. అంతేకాని పిల్ల నమ్ముకొని సుఖించుటకు కాదు. అమ్ముకో దలఁచుకొంటే నలువది వరాలు పుచ్చుకో వలసిన కర్మమేమి? ఏడువందలు పుచ్చుకో, ఎనిమిదివందలు పుచ్చుకో, వేయిరూపాయలు పుచ్చుకో, యని నా యింటిచుట్టు కుక్కలవలె పెండ్లికొడుకులు తిరుగుచున్నారు. వారి కివ్వకపోయినానా? కుఱ్ఱవాఁడు సాంప్రదాయకుఁడు బుద్ధిమంతుడు నైన వానిని జూచి కాశీయాత్ర కెంత సొమ్ము కావలెనో యంతే సొమ్ము పుచ్చుకొని యిచ్చివేయవలె నని యేర్పాటు చేసికొన్నాను. ఈ పిల్లవాఁడు నా కన్ని విధముల నచ్చినాఁడు. కాఁబట్టి తాంబూలము లిప్పించండి. ఐదారు దినములలో నేను వెళ్ళి మా వాళ్లను దీసికొనివచ్చి యిక్కడే వివాహము చేయగలను."

వారిరువురి మాటలు గణపతి కమితానందము గలిగింప నతఁడు "మహాదేవశాస్త్రిగారూ! నే నిప్పుడే వెళ్ళి అచ్చంబొట్లుగారిని, పాపన్న సోమయాజులుగారిని దీసికొని వచ్చెద" నని లేచి వెళ్ళి పూర్వోదాహృతులగువారిని దీసికొని వెళ్ళెను. మహాదేవశాస్త్రి వారిద్దరిని గౌరవించి కూర్చుండబెట్టి, వారిని రావించిన పని తెలియజేసి, తాంబూలము లిప్పించి పంచాంగము చూచి, తాను ముహూర్తము నిర్ణయము చేసెను. భైరవ దీక్షితులుగారు సకుటుంబముగ వచ్చిన తరువాత వారి కియ్యవలసిన నలువది వరహాలు నియ్య నిర్ణయము.