పుట:Ganapati (novel).pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

357

అనంతరము భైరవ దీక్షితులు స్వగ్రామమున కరిగి తన కుటుంబము దీసికొని వచ్చెను. కుటుంబముగా దాను భార్యయుఁ బెండ్లికూతురు, తక్కిన కూతుళ్లను జామాతలు వివాహమునకు పంపనందున తాము మువ్వురు మాత్రమే రావలసివచ్చిన దని యతఁడు గ్రామములో చెప్పెను. బ్రాహ్మణునకు వివాహకార్యము వచ్చినపుడు పీటల మీఁది పెండ్లి చెడగొట్టగూడదని గ్రామవాసు లదివర కిచ్చిన చందాగాక మరికొంత ద్రవ్యము సరకులు మొదలైనవి గణపతి కిచ్చిరి. ఒక వైశ్యుఁడు బియ్య మిచ్చెను. మరియొకఁడు నెయ్యి యిచ్చెను. ఒక పాత విద్యార్థి పల్లకి ఖర్చు పెట్టెను. ఒకఁడు భజంత్రీ కర్చు పెట్టెను. వివాహము రేపనగా గణపతి నలువది వరాలసొమ్ము భైరవశాస్త్రి చేతిలో బోసెను. గణపతి పక్షమున రావలసిన చుట్టము లెవ్వరు లేనందున మహాదేవశాస్త్రియె మేటిచుట్టమై మగపెండ్లివారి పక్షమున జేయవలసిన పని యంతయు జేసెను. సుముహూర్తమున గణపతికి యథావిధిగ వివాహ మయ్యెను. కన్నులార జూచి సంతోషించుటకు దల్లి సమయమునకు లేక రామేశ్వరము వెళ్ళినదని చూడవచ్చిన వారందరు విచారించిరి. పసుపులు నలుచుటకు, గౌరికల్యాణము పాటలు పాడుటకు, తగవులు నడపుటకు, మహాదేవశాస్త్రి భార్య మున్నగు పేరంటాండ్రు వచ్చి కార్యము కొనసాగించిరి. ఊరేగింపుటుత్సవ మిదివఱకే వర్ణింపఁబడినది గావున నిప్పుడు వేరుగ వర్ణింప నక్కఱలేదు. ఐదు దినములు