పుట:Ganapati (novel).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

గ ణ ప తి

కాని నలువురు జేరి మేఁకకు నాలుగు రూపాయలు వెలగట్టి చెరిసగము జేయుదుమని తునితగవుజేసి పాపయ్యచేత రెండు రూపాయలు వానికిప్పించి పంపిరి. యజ్ఞములోగూడ మేఁకలను జంపుటయె ప్రధానముగనుక పాపయ్యకు యజ్ఞఫలము చేకూరినదని చెప్పవచ్చును. లోకుల నందఱఁ బీడించి ధనము సంపాదించి పందిళ్ళు పాకలు వేయించి యన్నము దినకుండ మలమలమాడి కుమ్మరులచేత, మేఁకలను జంపించి కుండలములు వేసి కొన్నవానికి యజ్ఞఫలము దక్కి పాపయ్యకు దక్కకపోవునా? బ్రహ్మయు ఋత్విక్కులు నుద్గాతయు హోతయు నధ్వర్యుడు మొదలగువారక్కఱలేకుండ మంత్రములతో పనిలేకుండనతఁడు గాంధర్వవివాహమువలె యట్టహాసము చేయక రహస్యముగ యజ్ఞము చేయుటచే లోకులతనిని హీనునిగఁ జూచుచున్నారు. తక్కువ వర్ణమువారైన కుమ్మరుల చేత ముక్కు చెవులుమూసి బాధపెట్టి చంపించుటకంటె స్వఛ్ఛమైన బ్రాహ్మణుఁడు స్వయముగఁ జంపుటవలన మేఁకకు సద్యోమోక్షముసంప్రాప్తమైయుండునని యొక్కఁడైన నాలోచింపడుగదా. లోకములో న్యాయములేదు. ప్రస్తుతము లోకులేమనుకొన్నను పాపయ్యకు భవిష్యత్కాలమునైన రావలసిన కీర్తి రాకపోదు. ‘విద్యావిత్తకరీ’ యని యొక లోకోక్తిగలదు. పాపయ్య నేర్చుకొన్న తొమ్మిదవ యఠ్ఠముగూడ నొకానొక విద్యలోఁ చేరినదే కావునదానివలన నతఁడుధనసంపాదనమప్పుడప్పుడు చేయుచుండెను. పచ్చని తోరణము గట్టుకొని