పుట:Ganapati (novel).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గణపతి

31

యెవరు వివాహము చేసుకొన్నను పాపయ్య నాఁడొక యవధాని బిరుదమో దీక్షితబిరుదమో సోమయాజి బిరుదమో వహించి యచ్చోటికిఁబోయి సంస్కారులతోఁబాటు తన్నుఁగూడ సత్కరింపవలసినదని కోరుచుండును. అట్లు వారు సత్కరింపనిచోఁ జిన్ననాటనుండియు ముష్టిజీవనమున కలవడి యుండుటచేత ముష్టియుద్ధము ప్రారంభించి పురోహితులను గన్యాప్రదాతను వధూవరులను తద్బంధుగణమును దన నవమాఠ్ఠముతోఁ గొంతవరకు దీవించి తోరణములు తెంపి పెండ్లి పందిరి యుద్ధభూమిగ మార్చి తన పంతము నెగ్గించుకొని సంభావన దండిగ లంకించుకొని వచ్చును. అందుచేత నతనికి బండబూతుల పాపయ్య యనియు, పిడిగుద్దుల పాపయ్య యనియు రెండు పౌరుషనామములు కలిగినవి. అధికారుల యిండ్లచుట్టుఁ దిరిగి వారి సేవకుల నాశ్రయించి పండ్లు పంచదార చిలుకలు మొదలగు సూడిద లంపి యధికారుల యనుగ్రహమునకుఁ బాత్రులై కొందరీ కలియుగమున బిరుదుల కనర్హు లయ్యు సంపాదించుచుందురు, పాపయ్య సంపాదించిన బిరుదము లట్టివికావు. బిరుదుల నిమిత్త మఁత డొకరి నెన్నఁడాశ్రయింపలేదు. అతని కంఠశక్తియు భుజశక్తియు నతనికి బిరుదులు సంపాదించిపెట్టినవి. కాని యధికారుల కటాక్ష వీక్షణముచేతఁ ప్రసాదింపఁబడినవి కావు. పాపయ్యకుఁ దొమ్మిదవయఠ్ఠము నేర్పిన గురు వెవ్వరైయుందురని మీకు సందియము తోఁచవచ్చును. అతనికి గురువే లేడు. గురుకుల