పుట:Ganapati (novel).pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

287

కప్పుడువాని కే యుపాయము దోఁచలేదు. ఎందుకైనను మంచిదని యాతం డటనుండి మెల్ల మెల్లన నెవ్వరికి గనఁబడకుండ బారిపోయెను. అక్కడ చేరినవా రందరు బాలునకు భయములేదని చెప్పి కొంచెము మంచినీళ్లు త్రావ నిచ్చి మెల్లగా నింటికి బంపిరి. ఆ బాలుని తండ్రి మహాదేవశాస్త్రిగారి యింటికి వచ్చి గణపతితో మాటలాడగోరెను. కాని యెక్కడ వెదకినను గణపతి కానఁబడడయ్యెను. గణపతి పొరబాటుచేత నట్లుచేసి యుండ వచ్చును. కాని మరియొక క్రోధముచేత నతడు కొట్టియుండ డని మహాదేవశాస్త్రి యతనికి జెప్పి యొడంబరిచి పంపెను. అతి భయముచేత గణపతి నూతిలోనో గోతిలోనో దిగి యాత్మహత్య చేసికొన్నాడేమో యని మహాదేవశాస్త్రియు, వాని యింటి యాడువాండ్రును శంకించిరి. సాయంకాలమువరకు గణపతి కనబడనే లేదు. అతని తల్లి కొడు కెందులోనో దిగి చచ్చియుండు నని నిశ్చయించి "అయ్యో! కొడుకా! అయ్యో కొడుకా! యీ దిక్కుమాలిన యూరికి నిన్ను బలి యిచ్చినానురా నాయనా! నా వరహాలచేట్టు కూలిపోయినదోయి, దేవుడా! నా చిట్టిబాబును చూడండి, నాయనా!" యని వినువారి గుండె లవియునట్లు రోదనము చేయజొచ్చెను. రాత్రి నాలుగు గడియల ప్రొద్దు పోయినప్పటికి గణపతి రాలేదు. మహాదేవశాస్త్రిగారి భార్య యా సమయమున నావకాయ తీసికొనుటకై యటుక యెక్కి కుండదగ్గర చేయిబెట్టెను. చేతికి మెత్తనియొడలు తగిలెను. దీపము దీసికొనకయె వెళ్ళుటచేత నది యేమో యెరుంగక