పుట:Ganapati (novel).pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

గ ణ ప తి

యీ గ్రామములో మర్కటబాధ యెక్కువగ నుండుటచే తన చేతికి తగిలిన దేదో యా జాతి జంతు వనుకొని "కొండమ్రుచ్చు నాయనోయి ! కొండమ్రుచ్చ" ని గట్టిగా నరచి యాకళవళ పాటులో నిచ్చెన యొకచోట నుండగా మరియొకచోట దిగబోయి గుభాలున నేలబడెను. ఇంటిల్లిపాది పరుగెత్తుకొని వచ్చిరి. దైవవశమున నామె కాలుమాత్రమె బెణికెను కాని దెబ్బ మాత్రము విశేషముగఁ దగులలేదు; ఆ గొడవ విని యిరుగు పొరుగువా రందరు జేరిరి. ఏమి టేమి టని యెల్లవా రడిగిరి. కొండమ్రు చ్చటుకమీఁద గూర్చుండినదని యామె చెప్పెను. అప్పు డందులో ధైర్యవంతుఁ డొకడు దీపము వెలిగించుకొని యటుకమీఁద కెక్కెను. ఎక్కి చూచుచునప్పటికి కది కోఁతిగాదు, కొండమ్రుచ్చుగాదు కాని యాకార చేష్టలయందు నిజముగ కొండమ్రుచ్చని చెప్పదగిన మన గణపతియే!

అతఁ డావకాయగూనకుఁ జేరఁబడి గుర్రుపట్టి నిద్రపోయెను. ఇంత గొడవ జరుగుచున్న నతనికి మెలఁకువయే రాలేదు! అటుక యెక్కిన యతఁడు మొదట నది కొండమ్రుచ్చే యనుకొని మీఁదపడి కఱచునొ యను భయమున జాగ్రత్తగ సమీపించెను. కాని దీపపు వెలుగున గణపతి మూర్తి కనఁబడగానే "భయపడకండి భయపడకండి! కొండ మ్రుచ్చుగాదు, కోతిగాదు! మన పంతులుగా" రని క్రింద నిలిచియున్నవారి కందరకు వినబడునట్లు బిగ్గఱగ నరిచెను.