పుట:Ganapati (novel).pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

గ ణ ప తి

పిల్లలే పగులగొట్టినారు కాని నేను పగులగొట్టలేదని యబద్ధమాడి, యొట్టు పెట్టుకొని ప్రమాణముచేసి, యాయాపద తప్పించు కొనియెను. ఒట్లు ప్రమాణములు గణపతికి లెక్కలోనివి కావు. అతని దృష్టిచేత నన్నియు గాలికి పోవు మాటలే కావున వాని కనృతభయమనునది లేదు.

గణపతియొక్క పాండిత్యప్రభావము బోధనాశక్తి యెట్లున్నదో తెలిసికొని యానందింపవలె నని చదువరులు కుతూహల పడుచుందురు. కావున నట్టివిశేషములు కొన్ని యుదహరించుట సమంజసము. ఆ బడిలో చదువుకొనని క్రొత్తబాలుఁ డొకనాఁడు పాఠశాలకు వచ్చి గణపతియొక్క వికారరూపమును వికృత చేష్టలను విపరీతపు బ్రసంగమును విని యాతనిచేత మాటలాడించి యానందింప వలయు నని నిశ్చయించి దాశరథీ శతకము లోని "శ్రీరఘురామ చారుతులసీ దళ దామ" యను పద్యము చదివి "పంతులుగారూ ! దీని యర్థము మీ ముఖతః వినవలయు నని యున్నది. మీరు బహు సరసముగ జెప్పగల రని విన్నాను. కావున సెలవియ్యవలయును" నని యడిగెను. అటువంటి ప్రశ్న పాఠశాలలోని బాలుఁ డడిగిన పక్షమున వాని వీపు పుల్ల మజ్జిగ పోసి కాల్చిన రొట్టెవలె దెబ్బలతో నుదికి యుండును. అడిగినవాఁడు పాఠశాల విద్యార్థి గాక పైవాఁడగుటచే గణపతికి యేమియుఁ దోఁచక పచ్చివెలగకాయ గొంతు పడిన ట్లేమాటయు రాక క్రిందు చూచి మీదు చూచి నలు