పుట:Ganapati (novel).pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

269

లైనవి యస్త్రములైనట్టు వానికి బరికరము లగుచువచ్చెను. అవి దొరకినప్పుడు చేతితో చరచును. పిడిగ్రుద్దులు గ్రుద్దును. తొడపాశములు పెట్టును. చెవులు పెనవేయును. స్తంభమునకు గట్టి పెట్టి చింతబరికెలు తెప్పించి వెన్ను నెత్తురు గ్రమ్మునట్లు కొట్టును. కోదండము తీయించును. ఎండలో నిలువబెట్టి మీఁద రాళ్ళెత్తును. గోడకుర్చీలు వేయించి వారిపై బాలకులఁ గూర్చుండబెట్టును. కొందఱను వంగబెట్టి కాలికి మెడకు లంకెవేయును. వెయ్యేల! పాపకర్ముల నిమిత్తము యమధర్మరా జెన్ని నరకముల నిర్మించెనో గణపతి తన శిష్యుల నిమిత్త మన్ని దండనలు సృజించెను. తమ బిడ్డలయందు మితిలేని ప్రేమగల గ్రామవాసు లప్పుడప్పుడు పాఠశాలకు బోయి "యేమండీ పంతులుగారూ ! మాపిల్లవాని నంత దారుణముగఁ గొట్టినా రేమి? పిల్లవానివల్ల తప్పులుండవచ్చును. ఉన్నంతమాత్రముచేత నింతచేటు కొట్టుదురా? శరీర మంతట వాతలు బెట్టినట్టు దద్దురులు దేలినవి. అంత మోటదనమా? పసిబిడ్డలు నోరులేనివాళ్ళు చచ్చిపోగల" రని మందలింప గణపతి యుగ్రుడై తారాజువ్వవలె లేచి కోపావేశమున మాటలు తడబడ "మీ పిల్లవాఁడు వట్టి వెధవ. ఆ వెధవను నే నెలాగైన బాగుచేయవలె నని భయభక్తులు చెప్పుచున్నాను. ఈ లాగున వానిని మీరు వెనుక వేసికొని వచ్చి నాతో దెబ్బలాడితే యా వెధవకు భయముండునా? ఛీ! పుణ్యమునకు బోతే పాప మెదురుగ వచ్చినది. ఉపకారమున