పుట:Ganapati (novel).pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

గ ణ ప తి

నేను పెట్టినాను. గాని యెక్కువ పెట్టలేదు. అతని సంగతి మీకు తెలియదు. నామీఁద నేమో కోపము వచ్చి నలుగురిలో నన్ను రట్టు పెట్టుట కిట్ల జేయుచున్నాఁడు గాని నేను జేసిన తప్పు లేదు. ఆ యబ్బాయిని కంటగించుటకు నేనీలా గనలేదు. పోనీ నే నొక వేళ నిజముగా నన్న మెక్కువ పెట్టినా ననుకొన్నప్పటికీ అత్తా ! యన్న మెక్కువ పెట్టినావు తియ్యమనరాదా. మేనమామ నాలుగు రోజులు లేకపోగానే నన్నల్లరి పెట్టదలఁచినాడు." అని పలుక నా బ్రాహ్మణుఁడు "ఓరీ ! గణపతి ! నీ తల్లి వచ్చువరకు నీ వెట్లో గడుపుకొమ్మ"ని సలహా చెప్పి వెడలిపోయెను. గణపతి కోపావేశమున భోజనము చేయక యొక స్నేహితుని యింటికిఁ బోయి యన్నము దినెను. మిత్రుని యింటికి వెళ్ళినవాఁడు తల్లి వచ్చువఱకచ్చటనే భుజియించు నని మేనత్త యనుకొని, రాత్రి యతని నిమిత్తమై బియ్యము పోయలేదు. గణపతి రాత్రి భోజనమునకు సిద్ధమయ్యెను. "నీవు రావనుకొని నీకోసము బియ్యము పోయలేదు. వండిపెట్టెద నుండు"మని మేనత్త ప్రత్యుత్తరము జెప్పఁ జుట్టుప్రక్కల నున్న యాఁడువాండ్ర మగవాండ్ర బిలిచి "చూచినారా? రెండురోజులు మాయమ్మ గ్రామములో లేకపోఁగానే నాకీమె యన్నము పెట్టుట మానినది. వీళ్ళ కొంపలో నేను పొట్టకూటికున్నాని యావిడ యభిప్రాయము కాబోలు ! నే నన్నము లేక మాడి చచ్చిపోవలసినదేనా ? ఈ గ్రామములో నా కన్నము పెట్టువా రెవరు?" అని కల్లబొల్లి యేడ్పు లేడువఁ జొచ్చెను. ఆ