పుట:Ganapati (novel).pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

211

యేడ్పు వినగానే చుట్టుప్రక్కలమ్మలక్కలకు జాలిచేత మనస్సులు కరిగిపోయెను. "మా యింటికి రా, నాయనా ! పట్టెడన్నము మా లోపల తినరా, నాయనా !" యని ముసలమ్మలు కొంద రనిరి. "నేనే వండి పెట్టెదనమ్మా ! మీ యింటి కెందుకు రావలె?" నని గణపతి మేనత్త వారితోఁ బలికెను. అందులో నొక్క ముసలమ్మ గణపతిం జూచి "నాయనా ! మేనమామ భార్య మేనత్త కాదు. పినతండ్రి పెండ్లాము పినతల్లి కాదు. నీ సంరక్షణము నీ తల్లికి విధాయకము గాని మేనత్త కేమి విధాయకమురా? ప్రేమ చేత పేగు పెరపెర కోసికొనిపోవు చున్నదా యేమి? రా నాయనా? నే కెంతన్నము కావలె? నాలుగు మెతుకులు. నీ వన్నము తినకుండ యీ రాత్రి పండుకున్నావన్నమాట మీ యమ్మ వింటే గొల్లున యేడ్చి మొత్తుకొనును. లేక లేక వరప్రసాదిలాగు నొక్కడవు పుట్టినావు. నీమీఁద గంపెడాశ బెట్టుకొని ఆ ముండ యున్నది. అన్నము తినక చచ్చిపోకు. మా యింటికి రా! యని చేయు పట్టుకొని నాలుగడుగులు వెనుకకుఁదీసికొని పోయెను. అది చూచి మేనత్త కోపించి " నా మేనల్లునిం దీసికొని పోవుటకు నీవెవతవు? అనుకొన్నప్పుడు నాల్గుమాట లనుకోగలము, లేనప్పుడు కలియగలము మాకు మాకు విధాయకము 'సత్తిరాజువా రింటికి నీ వెక్కడి తొత్తు' వన్నట్టు, నడుమ నీ వెవ్వరమ్మా? అన్న మీ రాత్రి పెట్టగలవు గాని యెల్లకాలము పోషింప గలవా? మేనమామ పెళ్లాము మేనత్త గాదని నోటికి వచ్చినట్లన్నావు. నీవా యబ్బా