పుట:Ganapati (novel).pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

గ ణ ప తి

నను సరే నాకిష్టమే. నేను స్వలాభము చూచుకొనలేదు. ఆబ్ర్రాహ్మణున కుపకారము చేయవలయునని యిట్లు చేసినాను." అని సత్యమును గప్పిపుచ్చి, తన పరాభవము వారికిఁ దెలియకుండ మాటువేసి యిచ్చవచ్చిన తెఱగున దంభములు కొట్టెను. వారు యథార్ధస్థితి నెఱుఁగరు. కావున నిది సత్యమని నమ్మిరి. అంత దీనముగా బ్రతిమాలుకొన్నప్పుడు మన మొప్పుకోవలసినదే యని కొందరనిరి. అంత చేతగానివాఁడు మొదట మనము కోరిన కోర్కెల దీర్చెదనని యేల ప్రజ్ఞలు కొట్టవలెనని కొందఱనిరి. శ్రాద్ధము చెడిపోవునని యాప్రకారము చేసెనని మరికొంద ఱనిరి. "ఇంతకు మన యదృష్టములు బాగుగ లేవు. మనము కోటు తొడిగికొనునట్టి యోగము మనకుఁ బట్టలేదు. మన మొగముల కటువంటి భాగ్యము గూడనా!" యని యొకఁడనెను. "తొందరపడకండి ! ఆ భాగ్యము నేడు పట్టకపోయిన మఱియొకనాఁడు పట్టదా?" యని గణపతి పలికెను.