పుట:Ganapati (novel).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

గ ణ ప తి

గుడ్డ నిమ్మని నేను కోరెదను. మీరేమందురు?" అని గణపతి వారి నడిగెను. "సరే! యదే కోరు" మని వారైక్యకంఠ్యముగఁ బలికిరి. ఎవరి గొంతెమ్మకోరికె వాఁడు కోరెను. మాట లాడుచుండఁగానే యొక్కొక్కరి కన్నులు మూతపడెను. అందఱు గుఱుపట్టి నిద్రించిరి. అందఱు తమ కిష్టములైన గుడ్డను కోట్లు కుట్టించుకుని ధరించుకొని తిరిగినట్లు స్వప్నములు గాంచిరి. తాను కుట్టించుకున్న వంగపండు చాయకోటు తన స్నేహితులలో నొకఁ డెరువు పుచ్చుకున్నట్లు, మరల దానిం దెచ్చి యీయక యపహరించినట్లు గణపతి కలగని, కోపముతో కలలోనే స్నేహితునిమీఁద చేయి విసరెను. కోటు నపహరించుట కలలోని వార్తయైనను చేయి విసరుట వలన దన ప్రక్కనె నిద్రించుచున్న మిత్రునకు మాత్రము చెంపకాయ గట్టిగాఁ దగిలెను. దానితో నతఁ డులికిపడి లేచి "యెవఁడురా నన్ను కొట్టినాఁ" డని బిగ్గరరా నఱచుచు నల్లరి జేసెను. గణపతికి మెలఁకువ రాలేదు. తక్కినవాఱందరు లేచిరి. మేలుకొన్న వారందఱు ప్రయత్నముమీఁద గణపతిని మేల్కొల్ప నతఁడు తాను నిద్రలో సల్పిన దుండగ మెఱుగక నతనికిఁ దగిలిన దెబ్బకుఁ గారణ మేమి యని పలువిధముల విచారించి యెట్టకేల కిట్లనియె. "ఒరే! అప్పుడప్పుడు దయ్యములు వచ్చి మనుష్యులు నిద్దురపోవు చున్నప్పుడు బాధపెట్టుచుండును. ఒకప్పుడు రాత్రులు మనము పండుకొనఁ బోవునప్పటి కేమియు లేక తెల్లవారు నప్పటికి శరీరము మీఁద రక్కులు గీరులు గనఁబడును. ఒకప్పుడు తెల్లవారు నప్ప"