పుట:Ganapati (novel).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

191

టికి మన చేతులు వాచును. నిద్రలో నన్నెవరు బరికినారు? ఎవరు రక్కినారు? ఎవరు విరిచినారు? దయ్యమువచ్చి యాపనులు చేయుచుండును. నిన్ను కూడ దయ్యమే కొట్టియుండును. దయ్యమని భయపడవలసిన పనిలేదు. ఇవి ప్రతిదినము జరుగుచున్న ముచ్చటలే. అవి కొంటెతనము కోస మిటువంటి పనులు జేయును గాని హాని చేయుటకుఁ గాదు. చిన్నపిల్ల లెవరైన మనకు ముద్దుగాఁ గనబడి నప్పుడు మనము వాళ్ళ బుగ్గ గిల్లియో చిన్న చెంపకాయ గొట్టియో చేతిలో నున్న వస్తువు లాగికొనియో వారిని మన మేడిపించుచుందుము కదా! తమాషాకే మన మాపని జేయు చుందుము గాని బిడ్డల నేడిపించుట కని యుద్దేశ మున్నదా? అలాగే దయ్యములు గూడ మంచి యుద్దేశముతోఁ జమత్కారము కోస మిటువంటి పనులు చేయును. కాబట్టి భయపడ నక్కఱలేదు." ఆ యుపన్యాసము విని దెబ్బ తిన్నయతఁడు సంతుష్టుఁ డయ్యెను. అప్పుడు తెల్లవారు జామగుటచే మేలుకొన్న వారిలో గణపతి దక్క తక్కినవారు మరల నిద్రింపరైరి. అంతలో నాల్గవ జాము కోడి కూసెను. కొంత సేపటికిఁ దెల్లవాఱెను. కాలకృత్యములు దీర్చికొని గణపతి సపరివారముగ యజమానుని కడకుఁబోయి "అయ్యా ! కోటు గుడ్డలలో మీ ఇష్టము వచ్చినవి దెప్పించుటకు వీలులేదు. మేము మా కోరికలు చెప్పెదము. ఆ ప్రకారము దెప్పింపవలెను. నాకు వంగపండు చాయ పట్టుబట్ట కావలెను. తక్కిన వాండ్రు తమకు గావల