పుట:Ganapati (novel).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

గ ణ ప తి

మొదలిడినావు. నీకీబుద్ధు లెవరు గరపినా" రని మందలించెను. అనవుడు గణపతి "అయ్యా! నే వొక్కఁడనే కాదు. మా వాళ్ళకందఱ కట్టి కోరికలే యున్నవి. అడిగి చూడండి." "ఓరీ! ఏమిరా, మీ కేమి కావలెనురా" యని యరచెను. అరచుటయు గణాధిపతిమాట ననుసరించి ప్రమధ గణమువలెఁ దక్కిన పదమువ్వురు నేకకంఠముగ "మాకు సైనుగుడ్డలు వద్దోయి! కోటుగుడ్డలు కావలెనోయి!" అని ఇంటిమీఁదియాకు లెగిరిపోవు నట్లరచిరి. అదియెల్ల గణపతి చెప్పిన పాఠమే యని కర్త నిశ్చయించి కార్యవాదమే గాని ఖడ్గవాదము కర్తవ్యము గాదని క్షణ మాలోచించి, శ్రాద్ధము చెడకుండునట్లు మనసులో నొక యుపాయము పన్నుకొని యిట్లనియె. "సరే మీ కందఱకు సైనుగుడ్డ లిష్టములేకపోయిన పక్షమున మీకేమి కావలయునో యవే తెచ్చియిచ్చెదను. కాని యా గుడ్డ లిప్పుడు మా గ్రామములో దొరుకవు. కాకినాడకైనను, రాజమహేంద్రవరమున కైనను మనుష్యు నొక్కని బంపి యా బట్టలు తెప్పించవలెను. రేపు సాయంకాలమున కెట్లో తెప్పించెదను. ప్రస్తుతము కథ కానియ్యండి. సైనుగుడ్డ లెవరి కిష్టమో వారే పుచ్చుకోవచ్చు," యని యనునయించెను. గణపతి ప్రశాంతుఁడయ్యెను. అతనితో శిష్యగణ మంతయుఁ బ్రసన్నమయ్యెను. ప్రతిపక్షులు సైనుగుడ్డలు స్వీకరించి సంతుష్టులైరి. గణపతియు శిష్యులును రెండు దినములు కూడ నేమియు స్వీకరింపక కోటుగుడ్డలకై నిరీక్షించుచుండిరి.