పుట:Ganapati (novel).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

గ ణ ప తి

సులో నిష్టములేనివారు నేను చెప్పిన దోహదము చేయవద్దని నీకు దుర్భోదనలు చేయవచ్చును. వా రెన్ని చెప్పిననుసరె నీ వది వినవద్దు. సరిగా నెను చెప్పినట్టు చేయుము' ఆ యుపదేశముచేసి యతఁ డరిగెను. అది యెవరికిఁ జెప్పక బ్రహ్మోపదేశమువలె మనసులోఁ బెట్టుకొని రాత్రిభోజనాంతరమున నందఱు నిద్రాసక్తులైన సమయమునఁ జాకలివాండ్రు కాగడాల నిమిత్తమయి యిత్తడిసిద్దెలతో దాచుకొన్న యాముదము వారు చూడకుండ దొంగతనముగా రెండుచేతుల నిండబోసికొని తలకు రాసుకొని పెద్దమనుష్యులు కూర్చుండుటకుఁ వైచిన తివాసీమీద కరిగి దిండుమీఁద తలబెట్టుకొని పండుకొనియెను. మరునాఁడు గణపతి కాకులు కూసెడువేళనె లేచి గోదావరికరిగి రాగిడిమట్టితోఁ బలుసారులు తల రుద్దుకొని స్నానముచేసివచ్చి మరల బట్టలు కట్టుకుని కూర్చుండి కనబడిన వారినెల్ల బిలిచి "నా గిరజా లేమైన నెదిగినవేమో చూడు" డని యడిగెను. గణపతియొక్క విచిత్ర చరిత్ర మదివఱకె సువ్యక్తమై యున్నందున వారందఱు నగుమోముతో " నీ వేమి దోహదము చేసితివో కాని మిక్కిలి యేపుగా నీ వెంట్రుకలు పెరుగుచున్నవి. నిన్నటికి నేఁటికి నెంతో భేదము గనిపించుచున్నది. ఆ విధముగానె దోహదము చేయుచుండుము. నీతల జొన్న చేనువలె నెదుగునని చెప్పిరి. అతఁడాముదమె శిరోజవృద్ధికి దివ్యౌషధమని నిశ్చయించి యదియె యుపయోగింపఁ దలఁచెను. చాకలివాం డ్రుదయమున లేచి