పుట:Ganapati (novel).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

165

తివాసులు జభుఖాలు దులుపునప్పుడు దిండుమీఁద మెండుగా నుండిన యాముదపు మరకలు చూచి దానిమీద నాముద మెట్లయ్యెనని యెల్లవారి నడుగఁజొచ్చిరి. అడుగఁబడిన వారందఱు "మే మెఱుఁగము; మే మెరుగ" మని బదులుచెప్పిరి. చాకలివాఁడొకఁడు గణపతి నట్లు ప్రశ్నించుటయు నతఁడు మిక్కిలి కోపించి "ఎవడవురా నీవు తాహతెరుగకుండఁ బెద్దపిన్న తారతమ్యము లేక నన్నిట్టి ప్రశ్న లడుగుచున్నావా? నీ యంతర మేమి? నా యంతర మేమి? నీకు బొత్తిగా భయభక్తులు లేవు. చూడు పెళ్ళివారితో జెప్పి నిన్నేమి చేయింతునో నీవు తుంటరిలా గనపడుచున్నావు. నేనేమి తల కాముదము రాసుకొని దీనిమీఁద పండుకొన్నా ననుకొన్నావా యేమి జాగ్రత్త. బుద్ధి చెప్పించెదను. దొంగవెధవలు మీరే యాముదసిద్దెలు తెచ్చి దిండుమీఁద బెట్టినారేమో, అది గాకపోతే యాముదపు చేతులతో మీ రిద్దిండు ముట్టుకొని సవరించినా రేమో, లేకపోతే మీరిద్దిందు ముట్టుకొని సవరించినారేమో, లేకపోతే దానిమీఁద నాముదపుమరక లెట్టువచ్చు" నని విడిదియింటఁ బ్రతిధ్వను లగునట్లు గొంతు బొంగురు వోవునట్లు కేకలు వైచెను. ఆ కేకలతో నంద రక్కడకు చేరి చాకలివాండ్రనదల్చి యవ్వలకుఁ బొమ్మని చేసిన సంభాషణమును బట్టి గణపతియే తలవెంట్రుక లెదుగునిమిత్త మెవరో పరిహాసకుఁడు చెప్పినమాటలు విని తల కాముదము రాచికొని యుండునని మనసులో నిశ్చయించుకొని చిరునవ్వులు నవ్వుకొనుచు