పుట:Ganapati (novel).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

139

చేయుట కొక కాపరి కావలెను. వానికి జీతమీయవలెను. అందుకు డబ్బు కావలెను. గాడిదె కట్టి కాపరి యక్కఱలేదు. అశ్వమునకు సుళ్లు మొదలైనవి చూడవలెను. మంచి సుళ్లు లేని గుఱ్ఱమైనచో యజమానుని కొంపదీయును. గాడిదెకు సుడి చూడనక్కఱలేదు. గుఱ్ఱములు సొమ్ము కర్చుపెట్టి కొనవలెను. గాడిదను వెలయిచ్చి కొననక్కఱలేదు. చాకలివాండ్రవద్ద కావలసినన్ని యున్నవి. గుఱ్ఱముమీఁద జీను వేయవలయును; కళ్ళెములు కావలెను. గాడిద కవియేవియు నక్కఱలేదు. దానికి సంరక్షణ మక్కఱలేదు. అంగరక్షల పనిలేదు. వెల యక్కఱలేక సులభసాధ్యమై కొంగు బంగారమువలెనున్న గాడిదెను వదిలి గుఱ్ఱమునకై దేవులాడుట వెఱ్ఱితనము. అందుచేత సర్వవిధముల గాడిదెయే శ్రేష్ఠము. కాదాయనంటె నలుగురు నవ్వుదురు. ఒకరి నవ్వు జోలి నాకెందుకు? నన్ను జూచి నవ్విన పక్షమున వారిని జూచి నేను నవ్వెదను. వారి మొగమాటము నాకేమి? నేను కుక్క నెక్కుదును, గుఱ్ఱము నెక్కుదును, గాడిదెనెక్కుదును" అని పూర్వపక్షములు సిద్ధాంతములు తన మనంబున జేసికొని యెట్టకేలకు గార్ధభవాహన మధిరోహించుట కతడు కృతనిశ్చయుండయ్యెను. తమకు బట్ట లుదుకు చాకలివారి యింటికిఁబోయి నాలుగు చుట్టముక్కలు వానికి దానమిచ్చి వాని గాడిదెను యెరువిమ్మని యడిగెను. ఆమాట వినఁగానె వాడు నవ్వి "బాపనోరు గాడిదె నెక్కకూడదండీ తప్పు తప్ప"ని