పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"కొంత కాలం క్రిందట సుందరమయ్యరుకు (భగవాన్ తండ్రి) బంధుకోటిలో చేరిన యువకు డొకడు వివాహం వద్దని తల్లిదండ్రులతో వాదించి తాత్కాలిక వైరాగ్యంతో ఇక్కడికి వచ్చాడట. వస్తే వచ్చాడు ఉన్నన్నాళ్లు వుంటాడు పోనీలే అని చూస్తే మొదట్లోనే ఒక దినం బ్రాహ్మణేతరుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడట. సర్వాధికారి కది సరిపడక బ్రాహ్మణ పంక్తికి రమ్మంటే వినక 'భగవాన్ సన్నిధిలో జాతి భేదం ఎందుకు?' అన్నాడట. 'భగవాన్ అంటే అన్నీ వదలుకొన్నారు గనుక సరిపోయింది. నీ కెందుకది. మీ తల్లిదండ్రులు వింటే ఏమంటారు అని సర్వాధికారి హితంగా బోధిస్తే అతడు వినక వాదింప సాగాడట. వాదన ముదిరింది. భగవాన్ సాక్షి మాత్రంగా ఊరుకుంటే ఆ యువకుడు ఆగలేక శ్రీవారిని సమీపించి 'భగవాన్ సన్నిధికి వచ్చిన వెనుక జాతి భేదం పోవద్దా?' అన్నాడట.

"ఓహో! నీకు ఇదొక్కటేనా మిగిలింది. అన్నీపోయినవన్న మాటేనా? అన్నీ పోతే ఇదీ పోవచ్చునోయ్, పోవచ్చు నేమిటి? దానంతట అదే పోతుంది. ఏం? అన్ని భేదాలు పోయినవా నీకు' అని ప్రశ్నించారట భగవాన్. ఆ యువకు డంతటితో కుక్కిన పేనల్లే పలక్కుండా బ్రాహ్మణ పంక్తికి వచ్చి కూర్చున్నాడట.[1]

"మహర్షితో సంభాషణములు" (Talks With Maharshi) అను గ్రంథములో మరికొన్ని విశేషము లున్నవి.

  1. * శ్రీ రమణాశ్రమ లేఖలు - సూరి నాగమ్మ పుటలు 634, 635.