యిరువది యెనిమిది మంత్రములు ప్రకటములయ్యెను. నాయన వీనిని "ఛందో దర్శనమ్" అను గ్రంథమున గూర్చి దానికి "వాసిష్ఠాన్వయ భాష్యము" అను పేరుతో వ్యాఖ్యను రచించెను. సంస్కృత వాఙ్మయమునందు ఇది మణిపూస వంటిదని ప్రముఖ పండితులు శ్రీ ఆర్. ఆర్. దివాకర్ గారు ప్రశంసించిరి. ఇది ఆంగ్లములోనికి అనువదింపబడి భారతీయ విద్యాభవనము వారిచే ప్రకటింపబడినది.
ఈ భాష్యముయొక్క ముగింపునందు నాయన ఇట్లనెను. "విశ్వామిత్రగోత్రజుడైన దైవరాతుడు అధునాతన విశ్వామిత్రుడుగా తపస్సు చేసెను. ఒక ఋషియొక్క దృష్టితో చూచినచో యీ మంత్రములు గంభీరార్థములు కలవి. పవిత్రములు, పవిత్రీకరింప జాలినవి.
ఈ దైవరాతుడు ఒక యోగి, తపస్వి, వేదవేత్త, మంత్రద్రష్ట అని, తపస్సు, పాండిత్యము, సంస్కారము, సద్వర్తనము, వినయము అనుగుణములచే ప్రాచీనులైన ఋషులతో సమానత్వమును పొందుటకు అర్హుడనియు చెప్పుటకు నేను గర్వపడు చున్నాను". దైవరాతుడు మాత్రము తన యౌన్నత్యమునకంతకు గురు కటాక్షమే కారణమని వినయముతో చెప్పుకొనెను.
పౌరాణిక కథలను బట్టి వేదార్థములను, వేదార్థములను బట్టి పౌరాణిక కథలను విమర్శించుచుండుటయే నాయన నూతన తపో విధానముగా అవలంబించెను. రెండు పక్షములలో పాడ్యమి