నప్పుడు మంత్రనాదము ఎందు ఉదయించు చున్నదో పరికించినచో, పరికించు మనస్సు అందు లీన మగును. అదియే తపము."
బ్రహ్మోత్సవములలో అష్టమ దినమున కార్తిక శుద్ద చతుర్ధశి యందు అశ్వినీ యుక్త సోమవారమున (18 - 11 - 1907) ఈ యుపదేశము జరిగెను.
మొదటి వాక్యముచేత సకల కార్యములకు మొదట పుట్టునట్టి 'నేను' అను కర్తృత్వము యొక్క స్ఫురణము ఎందుండి పుట్టుచున్నదో గమనింప వలయునని, రెండవ వాక్యముచేత సకల వాక్యములకు మూలమైన నాదము ఎందుండి పైకి వచ్చుచున్నదో పరిశీలింప వలయునని అదియే తపస్సని మహర్షి బోధించెను. ఇది విన్నంతనే వాసిష్ఠుడు సకల వేదాంతముల సారము ఇదియే యని గ్రహించి అమృతమును రుచి చూచినవానివలె సంతోషము నొంది మరల గురువునకు సాష్టాంగముగ ప్రణమిల్లి 'ఈ యుపదేశమును అనుసరించి మీ పాద సన్నిధిని కొంతసేపు తపస్సు చేయుటకు అనుజ్ఞ నిండు' అని ప్రార్థించెను. 'గుహ లోపల కూర్చుండి ధ్యానింపుడు' అని స్వామి అనుజ్ఞ నొసంగెను. అదివఱ కెన్నడు వాసిష్ఠుడు గుహలో తపస్సు చేయలేదు. గురు కటాక్షము చేత గుహలో ప్రవేశించుటకూడ సంభవించెనని ఆయన సంతసించి గుహలో కూర్చుండి 'నేను' అను స్ఫురణము ఎందుండి వచ్చు చున్నదని విచారింప జొచ్చెను.
ఎట్టి ఆలోచనమును రానీయక, ఆలోచనము ఉబికినంతనే దాని పుట్టుక స్థానమును గమనించుచు దానిని అణచుట ఈ