Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. "నాయన" నామము

ఆనాడు భోజనానంతరం వాసిష్ఠుడు రథ చలన సంఘటనము వలన వ్యక్తమైన ఈశ్వారానుగ్రహమును గూర్చి ధ్యానించు చుండగా, బ్రాహ్మణ స్వామిని దర్శింప వలయునని తలంపు హఠాత్తుగా కలిగెను. 'ఆ స్వామి యందు కాషాయము, దండము మొదలుగా ఆశ్రమ ధర్మ లక్షణములు ఏమియు లేకున్నను, ఆయన యందు అచంచలమైన యాత్మ నిష్ఠ ఏదో వున్నది. లేకున్నచో అంత తేజస్సు కలవాడు అట్లు నిశ్చలముగా నుండ గలుగుట సంభవము కాదు; ఆయన సన్న్యాసి కాకున్నను సకలాశ్రమములను అతిక్రమించిన యవధూతయై యుండును' అని వాసిష్ఠున కప్పుడు తోచెను. తోచినదే తడవుగా ఆయన మండు టెండలో వడివడిగా విరూపాక్ష గుహ యొద్దకు పోయెను. అదృష్టవశమున అప్పుడు ఆ ప్రదేశము నిర్జనమై బ్రాహ్మణ స్వామి ఒక తిన్నెపై కూర్చుండి యుండెను. వాసిష్ఠుడు ఆయనకు పాదాభివందనము గావించి భక్తి పారవశ్యమున కనులవెంట బాష్పములు స్రవించు చుండగా ఇట్లు ప్రార్థించెను 'స్వామీ! ఉత్తమములైన పెక్కు మంత్రములతో తపస్సును గాఢముగా చేసితిని. కాని నా యందు ఇంకను దేవుడు ప్రసన్నుడు కాలేదు. నేను పండితుడ నైనను నా సాధనలో ఏమి లోపమున్నదో తెలిసికొన లేకున్నాను. తపస్సు యొక్క స్వరూపమును తెలిసికొనుటకై మిమ్ము శరణు పొందుచున్నాను. అనుగ్రహింపుడు.' స్వామి ఈ ప్రార్థనమును విని నెమ్మదిగా వాసిష్ఠుని గుర్తించి కరుణార్ద్ర దృష్టితో కొంతసేపు చూచి మెల్లగా తమిళమున ఇట్లనెను. " 'నేను' అను స్ఫురణము ఎందుండి వచ్చుచున్నదో విచారించినచో మనస్సు అందే లీనమగును. అదియే తపస్సు. జపము చేయు