ముగా నిద్రించి లేచునప్పటికి తాము ఆతిథ్యము పొందిన గృహము మాయమై దాని స్థానమున గణపతి దేవాలయము నొద్ద బయలు ప్రదేశము కన్పించెను. అది స్వప్న మనుకొనుటకు వీలు కాకుండా ఆ దంపతులొసంగిన తాంబూలములు గుర్తుగా కన్పించుచుండెను. కాంచీపురమందు గావించిన జపముతో శివ పంచాక్షరికి అయిదు కోట్లజపము పూర్తియగుటవలన అపితకుచాంబ అరుణాచలేశ్వరుడు అనుగ్రహించి తమ్ము అచటికి ఆకర్షించి ఆతిథ్యము నొసంగిరని గణపతి భావించుచు, తల్లిదండ్రుల యొడిలోచేరిన బాలునివలె ఆనందించెను.
అరుణాచలమున నివసించుచు అన్నము కొఱకు లోకులను యాచించుటకంటె పరమేశ్వరుని ప్రార్థించుటయే మేలని కావ్యకంఠుడు వేయి శ్లోకములలో హరస్తుతిని గావింప బూనుకొనెను. ఆశ్వయుజమున దేవీ నవరాత్రులైనంతనే 1902 అక్టోబరులో గ్రంథమును ఆరంభించి కావ్యకంఠుడు కార్తిక మాసమున కృత్తికోత్సవమునకు ముందే ముగించెను. ప్రతిదినము వ్రాసిన శ్లోకములను ఆయన సాయంకాలము నంది ముందు నిలుచుండి ఈశ్వర సన్నిధియందు వినిపించుచుండెను. పౌరులు ఆశ్చర్యచకితులై విన జొచ్చిరి. తుది దినమున శేషాద్రిస్వామి, బ్రాహ్మణస్వామియు వచ్చి విని ఆనందించిరి. గ్రంథము ముగియునప్పటికి ఈశ్వరానుగ్రహమున కావ్యకంఠునకు పాఠశాలయందు అధ్యాపకపదవి లభించెను. పది దినములలో ఆయన తమిళమును అభ్యసించి ఆ భాషలో విద్యార్థులకు బోధింపజొచ్చెను. కాని ఈశ్వరానుగ్రహము తనకు సమగ్రముగా లభింపలేదని, ఆత్మానందము గోచరించుట లేదని అయన