పొందుచు సుమారు మూడు నెలలుండెను. విశాలాక్షమ్మ అనారోగ్యము వలన పుట్టింటి కేగెను. కావ్యకంఠుడు సోదరుడైన శివరామశాస్త్రిని పిలిపించుకొని వాడితో భువనేశ్వరమున కేగి దేవిని ఒక మాసము ఆరాధించెను. అటనుండి ఆయన తమ్మునితో దంతవాణి సంస్థానమును దర్శించి కలకత్తాకు పోయి వెనుకకు మరలి కాంచీ నగరమునకు చేరి క్షీరవతీ, వేగవతీ నదుల మధ్యనున్న హనుమదాలయమున శివ పంచాక్షరిని ఒక నెల జపించెను. అక్కడ నారాయణుడను జ్యోతిష విద్వాంసుడు శిష్యుడయ్యెను. అతని మాటను పాటించి గణపతి తేజోలింగక్షేత్రమైన అరణాచలమునకు వచ్చెను.
అప్పుడు గణపతినవరాత్రుల యుత్సవములు జరుగు చుండెను. అందువలన పురము కోలాహలముతో నుండెను. కావ్యకంఠుడు మొదట అపితకుచాంబా దేవిని దర్శించి, పిదప అరుణాచలేశ్వరుని సేవించెను. అప్పుడాయనకు భక్తి యొక్క ఉద్రేకమున అపూర్వమైన యనుభవము కలిగి, "శక్తి, ఈశ్వరుడు ఇచ్చటనే నాకు పూర్ణానుగ్రహ స్వరూపులై కన్పించు చున్నారు. నా తపస్సు ఇక్కడనే సిద్ధి పొందును." అని ఆయన సోదరునకు చెప్పెను. శివరామశాస్త్రి కూడ అన్నతో అక్కడనే యుండుటకు నిశ్చయించుకొనెను. కాని వారి కచ్చట భోజనప్రాప్తి దుర్ఘటమయ్యెను. గణపతికి క్షేత్ర దేవతలపై కోపము వచ్చెను. అప్పుడు వారికి విచిత్రమైన యాతిథ్యము లభించెను. ఒక బ్రాహ్మణుడు కన్పించి తన భార్యయొక్క వ్రత పారణము కొఱకు వారి నిద్దరను ఆహ్వానించి ఆతిథ్యము నొసంగెను. వారు ఆ రాత్రి సుఖ