పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశాలాక్షి పుట్టింటిలో నుండవలెనని, తాను కోరినంతనే గణపతి తపస్సును వీడి రావలయునని, రెండు నిబంధనములను ఏర్పఱచెను. గణపతి అందులకు అంగీకరించి తన యిరువదియవ జన్మదినమునకు మఱునాడు 18-11-1897 వ తేది తండ్రి యాశీస్సులతో ప్రయాగకు పోయెను.

ప్రయాగలో శంఖ మాధవాలయమున హంసతీర్థము నందు గణపతి కొన్ని దినములు తపస్సుచేసి పుష్య మాసములో సూర్య గ్రహణమునకు కాశికి బయలు దేరెను. కాశిలో తండ్రికి మేనమామయైన ఆర్య సోమయాజుల భవానీ శంకరము యొక్క ఇంటియందు కాలము గడుపుచు గణపతి దర్భాంగ సంస్థానమున పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడైన శివకుమార పండితుని దర్శించి, ఆయనను కవితా వైభవముచేత పాండిత్య ప్రకర్షచేత ముగ్ధుని గావించెను. ఆయన గణపతిని నవద్వీపమున జరుగు విద్వత్పరీక్షకు పొమ్మని ప్రోత్సహించుచు అచ్చటి కార్య నిర్వాహకవర్గ కార్యదర్శికి పరిచయ పత్రము నొసంగెను.

పిదప ఒకనాడు గణపతికి సోమయాజుల సూర్యనారాయణ అను యోగి కన్పించి, 'భద్రకాదులము మనము పదునార్గురము లోక కార్యము కొఱకు జన్మించితిమి. ఒక్కొక్కరము ఒక్కొక్క కార్యము నందు ప్రీతితో నున్నాము. నేను సుకేతుడను. నీవు గణకుడవు. నీకు విహితమైన కార్యమును స్థూల శిరస్సు తెలుపగలడు' అని వెడలిపోయెను. రాత్రి కలయందు ఒక బ్రాహ్మణుడు కన్పించి నాసికయందు తపస్సు చేయుమని గణపతిని ప్రబోధించెను.