Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రాతిచిత్రం. శిష్యుడు గురువుకు నామకరణం చేయడం. మామూలుగా తల్లిదండ్రులు, గురుదేవులు పిల్లలకు, శిష్యులకు, నామకరణం చేస్తారు. కాని ఇక్కడ యిదొక విభిన్న పంథా. ఆ తర్వాత గురువు శిష్యునికి నాయన "నాయన" అని నామకరణం చేశాడు.

అక్కడ నుంచి మొదలైంది నాయన మరోజన్మ. అనేకానేక మహా మహిమోపేతములైన గ్రంథములు, దేశపర్యటనలు, తపస్సులు, ఆశ్రితుల నుద్దీపింపజేయడం. బ్రహ్మచర్యం, వానప్రస్థం సన్యాసం, వేద ధర్మాలు, వర్ణాశ్రమ దర్మాలు, అధ్యయనములు, ఉపన్యాసములు, శిష్యకోటి పరంపర, అన్నిటి మధ్య శ్రీ గురుని చల్లని నీడలో నిర్లిప్తత - ఇది నాయనను గురించి ముక్తసరిగా - అసంఖ్యాకములలో ఏ ఒకటో, రెండో విషయములు. దేవతలున్నారా ? తపస్సు సాధ్యమా ! మంత్రాలకు చింతకాయలు రాలుతవా ? మోక్షము సాధ్యమా ? విఘ్నములను ఎదుర్కొనుట సాధ్యమా? జ్యోతిష్యము నిజమా ? గురువు అవసరమా ? శిష్యుని లక్షణ, లక్ష్య, ధర్మ, కర్మములేవి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసములు ఒక జన్మలోనే అనుభవించ వీలగునా ! దిక్కులేని వారికి దేవుడే దిక్కనెడి సామెత నిజమేనా? తల్లిదండ్రుల ఆచార వ్యవహార, సంకల్పములను బట్టి సంతానము ఎలా వుంటుంది ? శరణాగతి అంటే ఏమిటి? ఆపదలలో నున్నప్పుడు శ్రీ గురుని కృప ఎలా శిష్యుని, ఆశ్రితుని అదృశ్యముగా కాపాడుతుంది? వీటన్నిటికి సమాధానములు "నాయన" ను గురించి అనేకులు వ్రాసిన అనేక చరిత్రలలో "భగవాన్" ను గురించి అనేకులు వ్రాసిన అనేకానేక గ్రంథములలో కొంతవరకు లభించవచ్చును.

ఆనాడేకాదు, ఈనాడు ఇకముందు కూడా ధ్యేయము బలముగా నుండిన సత్యాన్వేషణ తత్పరునకు గురువు అవసరము. శ్రీ గురునికి తనను అర్పించుకొన్న శిష్యుడు సదా శ్రీ గురుని శిక్షణలో పరిరక్షనలో సత్యములో లీనం కాగలడని అవగాహనకు వస్తుంది.