శిష్యులను సరియైన వర్తనము నందుంచుట గురువులకు కర్తవ్యము. అట్టియెడల గురువులు శిష్యులయెడ మొగమోటమితో వారి లోపములనుచూచి యుపేక్షింపరాదు. నాయన కర్తవ్య నిర్వహణమున ఎంత శ్రద్ద కలిగియుండెనో దీనివలన వ్యక్తమగుచున్నది.
నాయన ఆరోగ్యము క్రమముగా క్షీణింప జొచ్చెను. 21-7-1936 తేది మధ్యాహ్నమున నాయనకు మాటాడుటకుకూడ శక్తి లేకుండ పోయెను. నేమాని సూర్యనారాయణ అ స్థితిలో నాయనను చూచి భయపడి రమణమహర్షికి, మహాదేవునకు తంతి వార్త పంపించి లక్ష్మికాంతమునకు టెలిఫోనులో తెలిపెను. లక్ష్మికాంతము భార్యతో ఏపిల్ పండ్లను, గ్లూకోజు డబ్బాలను గైకొని ఆశ్రమమునకు మఱునాడు ఉదయము చేరెను. వారు అరగంట కొకసారి పండ్లరసము, గ్లూకోజు ఇచ్చుచుండగా నాయనకు నీరసము తగ్గెను. మధ్యాహ్నము ఒంటిగంటకు నాయన మంచమునుండి లేచి వస్త్రములు మార్చుకొని వరండాలోనికి నడువగలిగెను. ఇంతలో పెద్ద వర్షము కురిసి పాకయంతయు తడియ జొచ్చెను. పాకనుండి పార్వతీశముయొక్క ఇంటికిపోవుట మంచిదని లక్ష్మికాంతమనగా నాయన "రేపు శనివారము మధ్యాహ్నము రెండున్నర గంటలకు ఇక్కడనుండి వెళ్ళుటకు బాగుండును" అని స్పష్టముగా చెప్పెను. అది నిర్యాణమునకు ముహూర్తమని అప్పుడు ఎవ్వరికి తోచలేదు.
డజన్లకొద్దిగా ఏపిల్‌పండ్లను తెప్పించి నాయన మాట ననుసరించి రసమును తఱచుగా ఇచ్చుచుండిరి. వైద్యుడు వచ్చి చూచి నీరసము చాలవరకు తగ్గెనని చెప్పెను. పిమ్మట చీకటి పడుచుండగా శ్రీ రమణాశ్రమమునుండి నిరంజనానందస్వామి పంపిన